అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వ్యవస్థను మరింత కఠినతరం చేయడానికి సన్నద్ధమవుతున్నది. ఇదివరకే మంజూరు చేసిన వీసాల పొడిగింపునకు అదనపు వీసా ఫీజును వర్తింప చేయాలని ఆలోచిస్తున్నది. ఇప్పటివరకు కొత్త హెచ్-1బీ, ఎల్-1 వీసాలకు మాత్రమే ఈ రుసుము చెల్లించాల్సి ఉండేది. హెచ్-1బీ వంటి వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులను తమ వద్దే కొనసాగించుకోవాలనుకునే కంపెనీలకు దీనివల్ల ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే హెచ్-1బీ వీసా పునరుద్ధరణలో అత్యధిక వాటా కలిగిన భారతీయ నిపుణులపై కూడా దీని ప్రభావం పడనున్నది. అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ ఉద్యోగుల కొత్త హెచ్-1బీ వీసాలపై 1,00,000 డాలర్ల రుసుము విధించాలన్న ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేస్తూ దిగువ కోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించడానికి అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు గత నెలలో నిరాకరించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.

ఈ ప్రతిపాదన(అధికారికంగా దీనిని ప్రతిపాదిత నియమ-నిర్మాణ ప్రకటన అని పిలుస్తారు)ను హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఏజెన్సీ 2024 జూన్‌లో మొదటిసారిగా ప్రచురించాయి. దీనిని యూఎస్ ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించారు. ప్రస్తుతం అర్హత కలిగిన యజమాని ప్రాథమిక హెచ్-1బీ లేదా ఎల్-1 పిటిషన్‌ను దాఖలు చేసినపుడు లేదా విదేశీ ఉద్యోగి తన యజమానికి(ఉపాధి సంస్థను) మార్చుకున్నప్పుడు మాత్రమే ఈ రుసుము వర్తిస్తుంది. ప్రతిపాదిత నిబంధన ప్రకారం అదే యజమానులు ఇప్పటికే ఉన్న హెచ్-1బీ లేదా ఎల్-1 ఉద్యోగి బస కాలాన్ని పొడిగించాలని కోరినపుడు కూడా ఈ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అమెరికాలో 50 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉండి, వారిలో కనీసం సగం మంది హెచ్-1బీ, ఎల్-1 హోదాను కలిగి ఉన్న యజమానులను ఈ ప్రతిపాదన లక్ష్యంగా చేసుకుంది. ఈ యజమానులు ప్రస్తుతం కొత్త హెచ్-1బీ పిటిషన్ల కోసం కనీసం 4,000 డాలర్లు చెల్లిస్తున్నారు. ఈ ప్రతిపాదన ప్రకారం ఈ యజమానులు దాఖలు చేసే అన్ని నివాస పొడిగింపు పిటిషన్లకు ఈ చార్జీలను విస్తరిస్తారు. హెచ్-1బీ పొడిగింపు ఆమోదాలలో అత్యధిక వాటా కలిగిన భారతీయ నిపుణులపై ఎక్కువగా ఆధారపడే యజమానులపైనే ప్రతిపాదిత మార్పు అత్యధిక ప్రభావం చూపుతుందని అంచనా.





























