మానవాళి మేలు కోసం తమ సంపదను త్యాగం చేసే బిలియనీర్ల జాబితాలో ఓపెన్‌ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ చేరారు. తమ సంపదలో అత్యధిక భాగం దాతృత్వానికి అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయనతోపాటు ఆయన భాగస్వామి ఓలివర్ ముల్హెరిన్ ది గివింగ్ ప్లెడ్జ్ దాతృత్వ కార్యక్రమంపై సంతకం చేశారు. ఈ ప్రపంచం అభివృద్ధి చెందడం కోసం అనేక మంది ఎంతో శ్రమిస్తున్నారని, విజ్ఞానం, దాతృత్వం, అంకిత భావాలతో కృషి చేస్తున్నారని, వారు ఏర్పాటు చేసిన వేదిక తాము ఈ స్థాయికి చేరడానికి అవకాశం కల్పించిందని వీరిద్దరూ లేఖలో పేర్కొన్నట్లు ఈ చారిటీ సంస్థ తెలిపింది.

ది గివింగ్ ప్లెడ్జ్ చారిటీ సంస్థను వారన్ బఫెట్, బిల్ గేట్స్, మెలిందా గేట్స్ 2010లో ప్రారంభించారు. ప్రపంచంలోని సంపన్నులు దానం చేసేలా ఈ సంస్థ ప్రోత్సహిస్తుంది. ఇప్పటి వరకు 30 దేశాలకు చెందిన 240 మంది సంపన్నులు భారీగా విరాళం ఇస్తామని ప్రకటించారు.
