రష్యాతో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోనున్నది భారత ప్రభుత్వం. సుమారు 4 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఆ ఒప్పందం తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. లాంగ్ రేంజ్ వార్నింగ్ రేడార్ వ్యవస్థ ను రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయనున్నది. ఆ ఒప్పందానికి చెందిన సంప్రదింపులు అడ్వాన్స్‌డ్ దశలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అల్మాజ్-ఆంటే కార్పొరేషన్ కంపెనీ వోరోనేజ్ రేడార్‌లను ఉత్పత్తి చేస్తున్నది. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ మిస్సైల్ సిస్టమ్స్, రేడార్ల ఉత్పత్తిలో ఆ సంస్థ అగ్రస్థానంలో ఉన్నది. అయితే మిస్సైల్ బెదిరింపుల్ని గుర్తించి, ట్రాక్ చేసేందుకు సామర్థ్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తున్నది. ఈ నేపథ్యంలోనే సుదీర్ఘ దూరం నుంచి క్షిపణుల కదలికల్ని రేడార్లతో పసికట్టేందుకు ఈ కొనుగోలు చేపట్టనున్నారు. దాదాపు 8 వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలిస్టిక్ క్షిపణులు, విమానాలను వోరోనేజ్ రేడార్ వ్యవస్థ గుర్తిస్తుందని అధికారులు అంటున్నారు. కొన్ని దేశాల వద్దే ఉన్న ఇలాంటి టెక్నాలజీని ఇప్పుడు భారత్ కూడా సొంతం చేసుకోనున్నట్లు రష్యా చెబుతోంది.