1960ల నాటి ఉత్తర తెలంగాణ నేపథ్య కథాంశంతో శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రానికి భోగి అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలు. సంపత్‌నంది దర్శకత్వం. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. బుధవారం నుంచి షూటింగ్ మొదలు పెడుతున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. ఈ సందర్భంగా అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. విధి, పోరాటం, మార్పు అంటూ దర్శకుడు కథను నరేట్ చేస్తుండగా, హీరో శర్వానంద్ ఆయన మాటల్ని ఆసక్తిగా వింటూ ఓ యుద్ధం, సంఘర్షణతో కూడిన ప్రపంచాన్ని ఊహిస్తుంటాడు.

తిరుగుబాటుదారుడి వీరోచిత పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తమని అర్థమవుతున్నది. ప్రతి రక్తపు చుక్కకు ఓ కారణం ఉంటుంది. ప్రతి పండగకు ఓ ప్రయోజనం ఉంటుంది అని దర్శకుడు సంపత్‌నంది ఈ వీడియోపై వ్యాఖ్యానించారు. 1960ల నాటి ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో జరిగే కథాంశమిదని, అప్పటి కాలమాన పరిస్థితులకు అద్దంపట్టేలా అద్భుతమైన సెట్స్‌కు రూపకల్పన చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, ఆర్ట్: కిరణ్ కుమార్ మన్నె, రచన-దర్శకత్వం: సంపత్‌నంది.
