అమెరికాలో నాలుగో అతిపెద్ద నగరమైన హ్యూస్టన్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 600 మంది ప్రజలను సహాయ సిబ్బంది రక్షించారు. నాలుగు నెలల్లో కురువాల్సిన వానలు ఒక్క వారంలోనే పడటంతో నగరాన్ని వరదలు ముంచెత్తాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఎలాంటి మరణాలు, ప్రజలు గాయపడినట్టు సమాచారం అందలేదని తెలిపారు. హర్రిస్ కౌంటీలో 180 మందితోపాటు 122 పెంపుడు జంతువులను రక్షించినట్టు ఆ కౌంటీ జడ్జి తెలిపారు. పోల్క్‌కౌంటీలో 100 మందికిపైగా, మోంట్‌గోమెరికౌంటీలో 400 మందికిపైగా రక్షించినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. అనేక ప్రాంతాల్లో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతిన్నది. లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తడంతో ఇండ్లను ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు.