హీరో కిరణ్ అబ్బవరం తన కేఏ ప్రొడక్షన్స్ పతాకంపై సుమైనా స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న వైవిధ్యకథాచిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. సాయితేజ్, వేద జలంధర్ జంటగా నటిస్తున్నారు. వి.మునిరాజు దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ డ్రామా త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు.

కొమ్మ కొమ్మలో కోయిల కూయంగ, తెల్లవారే మా పల్లె పచ్చపచ్చంగ ఎచ్చని ఎలుగు సీరే కట్టే సక్కంగ.. ముగ్గుల పూలు పెట్టి మెరిసే అందంగా.. గడపల తోరణాలే గంతులు వేసెనుగా.. పూవుల పరిమళాలే గాలులు వీచెనుగా.. ముస్తాబవుతున్నాదీ శివరాతిరి పండక్కి ఊరు.. చిన్నాపెద్దల్లోన మొదలయ్యెను జాతర జోరు అంటూ పల్లెల్లో జరిగే శివరాత్రి పర్వదినాన్ని ఆవిష్కరిస్తూ ఈ పాట సాగింది. ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అక్షయ్‌రామ్ పొదిశెట్టి, సంగీతం: వంశీకాంత్ రేఖన.















