నందు విజయ్‌కృష్ణ, రష్మి గౌతమ్ జంటగా రాజ్ విరాట్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బొమ్మ బ్లాక్‌బస్టర్. ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకి హీరో నాగశౌర్య, డైరెక్టర్ విమల్ కృష్ణ, నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భగా నాగశౌర్య మాట్లాడుతూ మంచి కథతో తీసిన బొమ్మ బ్లాక్‌బస్టర్ ట్రైలర్, పాటలు చూస్తుంటే ఈ సినిమా చూడాలనిపిస్తోంది. నందు, రష్మీ బాగా నటించారు. ఈ సినిమా టైటిల్‌లాగానే బ్లాక్ బస్టర్ కావాలి అన్నారు. నందు విజయ్‌కృష్ణ మాట్లాడుతూ నాపై నమ్మకంతో ఈ చిత్రకథ వినకుండా నటించారు రష్మి. ఈ చిత్రాన్ని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన నిర్మాతలకు థ్యాంక్స్ అన్నారు. మా సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదించాలి అన్నారు నిర్మాతలు. నాది, నందూది 14 ఏళ్ల జర్నీ, రాజ్ విరాట్ కథను నుందు నమ్మితే నేను నందును నమ్మి ఈ సినిమా చేశా అన్నారు రష్మి. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అందరి నచ్చుతుంది అన్నారు రాజ్ విరాట్. ఈ కార్యక్రమంలో సెవెన్‌హిల్స్ సతీశ్, శ్రీను, శేషాద్రి, సుడిగాలి సుధీర్, ధన్‌రాజ్, సత్యం రాజేశ్‌తో పాటు, సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్.విహారి తదితరులు పాల్గొన్నారు.














