వాళ్లంతా కోటి ఆశలతో ఎంబీబీఎస్ చదువుకోవాలని ఉక్రెయన్ వెళ్లారు. మొదట్లో అంతా బాగానే ఉంది. అంతలోనే యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. వాళ్ల భవిష్యత్తు అంధకారంగా మారింది. ప్రాణాలతో స్వదేశం చేరుకోవడమే పెద్ద సవాలు అనుకున్నారు. ఎలాగోలా తిరిగొచ్చారు. కానీ, చదువు కొనసాగించడం ఎలా? అనుకుంటున్నప్పుడు సరిగ్గా అలాంటి సమయంలో నియో ఓవర్సీస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ వారిని ఆదుకుంది.
భారత ప్రభుత్వంతో, ఎన్ఎంసీతో, ఉజ్బెకిస్థాన్ విదేశీ మంత్రిత్వశాఖ, అక్కడి వైద్య కళాశాలలతో సంప్రదించి, 210 మందిని తమ ఎంబీబీఎస్ చదువు ఉజ్బెకిస్థాన్‌లో పూర్తిచేసేందుకు పంపింది. వారిలో 86 మంది అమ్మాయిలు ఉన్నారు. వీళ్లంతా ఇంతటి సంక్లిష్ట పరిస్థితులను అధిగమించి, మానసిక ఒత్తిడిని జయించి ఎంబీబీఎస్ పూర్తిచేశారు. వాళ్లందరికీ నగరంలోని ప్రధాన దవాఖానలలో ఒకటైన ఏఐజీ ఆస్పత్రిలో కన్నులపండువగా జరిగిన కార్యక్రమంలో పట్టాలు పంపిణీ చేశారు. వీళ్లలో 110 మంది ఎఫ్ఎంజీఈ పరీక్ష రాయగా, అందులో 81 మంది తొలిసారే ఉత్తీర్ణులయ్యారు.