స్వీయ నిర్మాణ సంస్థ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై శివాజీ నటిస్తున్న చిత్రం సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. ఇందులో శివాజీకి జోడీగా లయ నటిస్తున్నది. రోహన్, ప్రిన్స్, అలీ, ధన్రాజ్ ఇతర ప్రధాన పాత్రధారులు. సుధీర్ రామ్ దర్శకుడు. ఈ చిత్రం ట్రైలర్ను ఆవిష్కరించారు. ఈ వేడుకకు దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సినిమా నవ్విస్తూ భయపెడుతుందని, చివరి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతుందని, తన కెరీర్ ముగిసిందనుకునే తరుణంలో ఓటీటీలో ఆఫర్లు వచ్చాయని, దాంతో కెరీర్ మరోసారి ఊపందుకుందని శివాజీ తెలిపారు. కుటుంబం కోసం ఎంత త్యాగానికైనా సిద్ధపడే మహిళగా తన పాత్ర చక్కటి భావోద్వేగాలతో సాగుతుందని నటి లయ చెప్పింది. ఆద్యంతం వినోదాలు పంచే కథ ఇదని దర్శకుడు సుధీర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఈటీవీ విన్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.















