అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన చిత్రం ఆ ఒక్కటీ అడక్కు. మల్లి అంకం దర్శకుడు. ఈ నేపథ్యంలో నిర్మాత రాజీవ్ చిలక విలేకరులతో ముచ్చటించారు. పెళ్లి అనేది అందరూ రిలేట్ చేసుకునే అంశం. అలాగే ఈ కథలో కామెడీతోపాటు ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయి. అందుకే ఈ కథను మా తొలి సినిమా కథగా ఎంపిక చేసుకున్నాం అని అన్నారు. ఈ కథ వినగానే నా మదిలో మెదిలిన హీరో రాజేంద్రప్రసాద్‌గారు. యంగ్‌గా ఉంటే ఈ కథకు ఆయనే పర్‌ఫెక్ట్. ఇప్పుడైతే నరేశ్ తప్ప వేరే ఆప్షన్ లేదు. నరేశ్‌గారికి కూడా ఈ కథ బాగా నచ్చింది. పెళ్లి ఆలస్యమవుతుండటంతో డిప్రషన్‌లోకి వెళ్లిపోతుంటారు కొందరు. ఈ రోజుల్లో ఆర్థికంగా సెటిల్ అవ్వడం కంటే, పెళ్లి అవ్వడం పెద్ద టాస్క్. ఒకప్పుడు చుట్టాలూ, పక్కాలు అందరూ కలిసి సంబంధాలు సెట్ చేసేవారు. ఇప్పుడు వేరే రాష్ట్రంలోనో వేరే దేశంలోనో ఉంటూ, పెళ్లికోసం వెబ్‌సైట్లను ఆశ్రయిస్తున్నారు. వాటిపైనే ఆధారపడిపోతున్నారు. మ్యాట్రీమొనీ సైట్స్ ద్వారా ప్రస్తుతం లక్షల పెళ్లిల్లు జరుగుతున్నాయి. అలా ఒక్కటైన జంటల్లో చాలామందికి ఒకరి గురించి ఒకరికి తెలీదు. ఈ నేపథ్యంలో హ్యూమర్, ఎమోషన్స్ నడుమ సాగే మంచి కథ ఇది అని తెలిపారు.
ఆ ఒక్కటీ ఆడక్కు టైటిల్‌ని నరేశే సూచించారనీ, పెళ్లి అవ్వక బాధపడుతున్న హీరోను, పెళ్లెప్పుడని అందరూ అడుగుతుంటే, సహజంగా పలికే డైలాగ్ ఆ ఒక్కటీ అడక్కు అనీ. ఈ కథకు ఈ టైటిల్ యాప్ట్ అనీ, పైగా నరేశ్‌గారి నాన్నగారి సూపర్‌హిట్ సినిమా టైటిల్ కావడంతో ఆ సెంటిమెంట్ కూడా కలిసొచ్చిందని చెప్పారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ మనసుపెట్టి పనిచేశారనీ, రెండున్నర గంటలపాటు అందర్నీ కడుపుబ్బ నవ్వించే సినిమా ఇదని రాజీవ్ నమ్మకం వెలిబుచ్చారు. మే 3న సినిమా విడుదల కానుంది.