Skip to main content

Namaste NRI

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు నానా పటేకర్ ఇక లేరు

భారతీయ సినీ పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు నానా పటేకర్ కన్ను మూశారు. 75 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. గోవాలోని డోనా పౌలాలో ఉన్న తన నివాసంలో నానా పటేకర్ అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే కుటుంబ సభ్యులు, సిబ్బంది ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ప్రాణాలను కాపాడలేకపోయారు. వైద్యుల ప్రకారం నానా పటేకర్‌ తీవ్రమైన గుండెపోటుకు గురైనట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఉదయం 5:20 గంటలకు ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన అనంతరం దాదాపు 45 నిమిషాల పాటు నిరంతరంగా సీపీఆర్‌ చేసి ప్రాణాలు కాపాడేందుకు వైద్య బృందం ప్రయత్నించింది. అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని మణిపాల్ ఆసుపత్రి ఆంకాలజీ విభాగం చీఫ్ డాక్టర్ శేఖర్ సల్కర్ తెలిపారు.

నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. 1978లో వచ్చిన గమన్ చిత్రంతో ఆయన సినీ ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత హిందీ, మరాఠీ చిత్రాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. సాధారణ పాత్రల నుంచి ప్రతినాయకుడి వరకు, భావోద్వేగభరితమైన పాత్రల నుంచి పవర్‌ఫుల్ క్యారెక్టర్ల వరకు తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పరిందా, ప్రహార్, అంగార్, తిరంగా, క్రాంతివీర్, ఖామోషి వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకమైనవిగా నిలిచాయి. క్రాంతివీర్ లో ఆయన పోషించిన పాత్రకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు లభించింది. పరిందా, అగ్ని సాక్షి వంటి చిత్రాల్లో ఆయన నటనకు జాతీయ అవార్డులు కూడా దక్కాయి. 2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నానా పటేకర్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ప్రహార్: ది ఫైనల్ అటాక్ చిత్రానికి దర్శకత్వం వహించారు. సినిమాలతో పాటు రంగస్థల అనుభవం కూడా ఆయన నటనకు బలమైన పునాదిగా నిలిచింది. పాత్ర ఏదైనా దానిలో పూర్తిగా లీనమైపోయే నటుడిగా నానా పటేకర్‌కు ప్రత్యేకమైన పేరు ఉంది.

హిందీ, మరాఠీ సినిమా రంగానికి నానా పటేకర్ చేసిన అపారమైన సేవలను గుర్తుచేసుకుంటూ, ఆయన బహుముఖ ప్రజ్ఞను, సృజనాత్మకతను ప్రశంసిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సంతాపం తెలిపారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా పటేకర్ మరణం పట్ల తీవ్ర సంతాపం తెలిపారు. ఆ ప్రముఖ నటుడితో కలిసి ఉన్న చిత్రాన్ని పంచుకుంటూ, ఆయన మరణం కళా ప్రపంచానికి పూడ్చలేని నష్టం అని పేర్కొన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పటేకర్ కు నివాళులర్పిస్తూ నానా పటేకర్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదు, ఆయన స్వయంగా ఒక సంస్థ వంటివారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన అందించిన విశేషమైన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి అని కొనియాడారు.

నానా పటేకర్ మృతి పట్ల జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ భారతీయ చలనచిత్ర రంగంలోని అత్యుత్తమ నటులలో ఒకరైన నానా పటేకర్ గారు కన్నుమూయడం తీవ్ర విచారకరం. ఆయన పోషించిన ప్రతి పాత్రలోనూ నిజాయతీ, గాఢత స్పష్టంగా ప్రతిబింబించేవి. ఆయన నటన కేవలం అభినయంలా కాకుండా, తెరపై జీవితమే ఆవిష్కృతమవుతున్నట్లుగా ఉండేది. చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన సేవలు తరతరాల పాటు గుర్తుండిపోతాయి అని పేర్కొన్నారు. ప్రభుదేవా, ప్రకాష్ రాజ్, ఖుష్బూ సైతం ఆయనతో తమకున్న అనుబంధాన్ని స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events