కార్మిక దినోత్సవంనాడు చైనాలో విషాదకర సంఘటన జరిగింది. గ్వాంగ్‌డాంగ్, నార్తర్న్ మెయిఝౌ సిటీ, డబు కౌంటీలో బుధవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో ఓ హైవే కూలిపోవడంతో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్వత ప్రాంతంలో ఉన్న ఈ హైవే శిథిలాల క్రింద సుమారు 20 వాహనాలు, 54 మంది ప్రయాణి కులు చిక్కుకున్నారు. కార్మిక దినోత్సవాల సందర్భంగా ఐదు రోజులపాటు సెలవులు కావడంతో హైవేలపై టోల్ ఫ్రీగా ప్రయాణం చేయవచ్చు. దీంతో ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉండే సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ ఘటనతో ఆ హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ప్రస్తుతం అధికారులు ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ఆ ప్రాంతంలో ఇటీవలే చోటు చేసుకున్న వాతావరణ మార్పులు, వర్షాలు, వరదలు, సుడిగాలుల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకొని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.