మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర నుంచి ఇటీవలే రామ రామ అంటూ భక్తి భావాలతో కూడిన ఓ గీతాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలుస్తున్నది. ఇప్పటికే రెండున్నర కోట్లకుపైగా వ్యూస్ సాధించిన రికార్డు సృష్టించింది. అదే విధంగా అన్ని మ్యూజిక్ ఛార్ట్స్‌లో అగ్ర భాగాన కొనసాగుతున్నది. కోదండరాముడి గుణగణాలను కీర్తిస్తూ సాగిన ఈ పాట ప్రేక్షకులందరినీ అలరిస్తున్నది.

చిరంజీవి నృత్యరీతులు, కీరవాణి బాణీ, రామజోగయ్య శాస్త్రి చక్కటి సాహిత్యం ఈ పాటలో ప్రధానాకర్షణలుగా నిలుస్తున్నాయని మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్ కథానాయికలుగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ తుదిదశలో ఉంది. దసరా కానుకగా సెప్టెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
