ఇటీవల అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా జరిగిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డుల కార్యక్రమంలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రం సత్తా చాటింది. నాలుగు విభాగాల్లో అవార్డులతోపాటు స్పాట్‌లైట్ అవార్డు కూడా అందుకుంది. దర్శకుడు రాజమౌళి , రామ్‌చరణ్, కీరవాణి, కె.కె.సెంథిల్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని అవార్డులు అందుకున్నారు. అయితే ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఆయన్ను పిలవలేదా? అంటూ నెటిజన్లు, అభిమానులు హెచ్‌సీఏ సంస్థను ప్రశ్నిస్తూ కామెంట్లు చేశారు. తారక్ (Tarak) ఈ వేడుకకు ఎందుకు రాలేకపోయాడు వివరణ ఇస్తూ ఓ పోస్ట్ చేసింది హెచ్‌సీఏ సంస్థ. తారక్ రాకపోవడానికి కారణాలను తెలిపింది. ఈ అవార్డుల కార్యక్రమానికి తారక్‌ను పిలిచామని, కానీ తారక్ ఇండియాలో ఓ సినిమా షూటింగ్ కారణంగా రాలేకపోయాడని హెచ్‌సీఏ తెలిపింది. అంతేకాకుండా తన సోదరుడు తారకరత్న మరణించడంతో షూటింగ్ కూడా నిలిపివేశారని వెల్లడించింది. అయితే త్వరలోనే ఈ అవార్డును ఎన్టీఆర్‌కు అందజేస్తామని, మీ అందరి ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. దీంతో ఎన్టీఆర్ హెచ్‌సీఏ అవార్డుల కార్యక్రమానికి వెళ్లకపోవడంపై ఫ్యాన్స్‌కు ఫుల్ క్లారిటీ వచ్చేసింది.
