బ్రిటన్ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ దేశానికి తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మంత్రి గా భారత మూలాలున్న కనిష్క నారాయణ్ బాధ్యతలు స్వీకరించారు. కనిష్క నారాయణ్ను ఏఐ మంత్రిగా నియమిస్తున్నట్లు బ్రిటన్ నూతన ప్రధానమంత్రి ఆండీ బర్న్హామ్ ప్రకటించారు. ఆ మేరకు తాజాగా కనిష్క నారాయణ్ బాధ్యతలు స్వీకరించారు. శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ సాంకేతికతలో ప్రపంచస్థాయి అగ్రగామిగా నిలవాలన్న యూకే ప్రభుత్వ లక్ష్యానికి ఈ నియామకం అద్దం పడుతోంది.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఏఐతో ముడిపడిన అవకాశాలను, సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఏఐ నియంత్రణ, నైతిక వినియోగం, ఆర్థికవ్యవస్థతో దాని అనుసంధానం వంటి అంశాలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టెక్నాలజీ పాలసీ, ఆవిష్కరణల రంగంలో అపార అనుభవం ఉన్న కనిష్క నారాయణ్ నియామకాన్ని ఒక వ్యూహాత్మక అడుగుగా భావిస్తున్నారు. ఏఐవల్ల కలిగే ప్రయోజనాలను అందిపుచ్చుకుంటూనే, దానితో ముడిపడిన ముప్పులను నివారించడం ఆయన ప్రధాన బాధ్యత కానుంది. కాగా కనిష్క వేల్స్ నుంచి ఎంపీగా గెలుపొందారు.





























