విజయ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం జన నాయగన్. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ నటించిన తొలి చిత్రం కావడంతో పాటు, ఆయన కెరీర్లో చివరి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు హెచ్. వినోద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.ఇప్పటికే జన నాయగన్ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన భగవంత్ కేసరి కథ ఆధారంగా రూపొందిందనే ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై స్పందించిన దర్శకుడు హెచ్. వినోద్, ఆ వార్తల్లో కొంత నిజం ఉందని అంగీకరించారు.

అయితే ఇది పూర్తిస్థాయి రీమేక్ కాదని, కథలో అనేక మార్పులు చేసినట్లు స్పష్టం చేశారు. మొదటి భాగంలో సుమారు 60 శాతం, రెండో భాగంలో 20 శాతం మాత్రమే మూల కథ ప్రభావం ఉంటుందని, మొత్తంగా 50 శాతం మాత్రమే భగవంత్ కేసరి నుంచి తీసుకున్నామని వెల్లడించారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించిన విషయం హీరోయిన్ పూజా హెగ్డే పాత్ర గురించే. భగవంత్ కేసరి లో కాజల్ అగర్వాల్ డాక్టర్ పాత్రలో కనిపించగా, జన నాయగన్ లో పూజా హెగ్డే జర్నలిస్టు (ప్రెస్ రిపోర్టర్) పాత్రను పోషించిందని వినోద్ తెలిపారు. అంతేకాదు, సినిమాలో విజయ్‌తో ఆమెకు రొమాంటిక్ ట్రాక్ లేదని, ప్రేక్షకులు ఊహించినంత స్క్రీన్ స్పేస్ కూడా ఉండదని స్పష్టం చేశారు.

స్క్రిప్ట్ సిద్ధం చేసిన సమయంలో పూజా హెగ్డే పాత్రకు మరిన్ని కీలక సన్నివేశాలు రాసినప్పటికీ, సినిమా నిడివి పెరగడంతో వాటిలో చాలావాటిని చిత్రీకరించలేకపోయామని వినోద్ వెల్లడించారు. ఈ కారణంగా పూజా పాత్ర పరిమితమైందని, అందుకు ఆమెకు వ్యక్తిగతంగా క్షమాపణలు కూడా చెప్పానని ఆయన తెలిపారు.





























