Skip to main content

Namaste NRI

ఘనంగా ముగిసిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం

అమెరికాలోని మిస్సోరిలోని ది హిందూ టెంపుల్ ఆఫ్ సెయింట్ లూయిస్ ఆధ్వర్యంలో నిర్వహించిన నవకుండాత్మక శతచండీ సహిత రుద్రయాగం ఆరు రోజుల పాటు అత్యంత వైభవంగా సాగి దివ్యమైన పూర్ణాహుతితో విజయవంతంగా ముగిసింది. ప్రపంచశాంతి, లోకక్షేమం, సనాతన ధర్మ పరిరక్షణ, సమస్త ప్రజల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధి కోసం నిర్వహించిన ఈ మహాయాగంలో అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొని విశేష భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. ప్రతిరోజూ ఉదయం గోమాత పూజతో ప్రారంభమైన కార్యక్రమాలు మహాన్యాస పారాయణం, రుద్రహోమం, చండీ హోమం, వారాహి హోమం, అరుణ హోమం, రాజశ్యామల హోమం వంటి అనేక విశిష్ట వైదిక క్రతువులతో యాగశాలను ఆధ్యాత్మిక తేజస్సుతో నింపాయి. ముఖ్యంగా రెండో రోజు నిర్వహించిన దశసహస్ర మోదక హోమం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. గణపతికి ప్రీతికరమైన పది వేల మోదకాలను ఆలయ వాలంటీర్లు స్వయంగా భక్తితో సిద్ధం చేయడం ఈ మహాయాగంలో ప్రత్యేక ఘట్టంగా నిలిచింది.

90 అడుగుల విశాల వేదికపై నిర్వహించిన షట్ కల్యాణ మహోత్సవం ఈ మహాయాగానికి అపూర్వ శోభను తీసుకొచ్చింది. ఒకే వేదికపై, ఒకేసారి శ్రీ రాధాకృష్ణుల కళ్యాణం, శ్రీ సీతారామ కళ్యాణం, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం, శ్రీ శివపార్వతుల కళ్యాణం, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాయాగం విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆలయ యాజమాన్యం వేదపండితులను ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ విజయ్ కె. సాక్షి, కార్యదర్శి జంగా కిషోర్, కోశాధికారి మురళీకృష్ణ పుట్టగుంట, స్టీరింగ్ కమిటీ సభ్యుడు బైరపునేని సురేంద్రనాథ్, మీడియా విభాగ సమన్వయకర్త రాజా సూరపనేని తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News