హీరో నారా రోహిత్ సౌండ్ ఇంజనీర్ గా ప్రేక్షకుల్ని పలకరించనున్నారు. నయన్ సారిక కథానాయిక. చినిమిల్లి మణికుమార్ దర్శకుడు. భరత్‌చౌదరి నిర్మాత. నారా రోహిత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. అందరి దృష్టినీ ఆకర్షించేలా సౌండ్ ఇంజనీర్ అనే టైటిల్ లోగోను మేకర్స్ డిజైన్ చేశారు. తెల్లటి కుర్తా, పైజామా ధరించి, టెర్రాస్ అంచున కళ్లు మూసుకుని ప్రశాంతంగా ధ్యానం చేస్తున్న నారా రోహిత్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు.

కథానాయకుడి ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఓ కాన్సెప్ట్ వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. హీరో పాత్రకు వినికిడి లోపం ఉందని తెలివిగా సూచిస్తూ, ఈ పోస్టర్‌నీ, వీడియోనీ క్రియేట్ చేయడం జరిగిందని తెలుస్తున్నది. ప్రేమ, హాస్యం, భావోద్వేగాలు, సంగీతం సమ్మేళనంగా ఈ కథ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో నరేష్ వీకే, రోహిణి, సంపత్, అజయ్ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ సి.దిలీప్, సమర్పణ: శ్రీలత చెరుకూరి, నిర్మాణం: కరణ్ సి.ప్రొడక్షన్స్ ఎల్‌ఎల్‌పీ.





























