Skip to main content

Namaste NRI

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ”నెలనెల తెలుగువెన్నెల” ,తెలుగు సాహిత్య వేదిక 228 వ సాహిత్య సదస్సు 2026

మన భాష, సాహిత్యం, సంస్కృతి పరిరక్షణ ప్రధాన ధ్యేయంగా మొదలు పెట్టిన డల్లాస్ ఫోర్ట్ వర్త్, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం , టాంటెక్స్ ”నెలనెల తెలుగువెన్నెల” ,తెలుగు సాహిత్య వేదిక 228 వ సాహిత్య సదస్సు 2026 జులై నెల 26 వ తేదీ న ఆదివారం నాడు “లూయీస్ విల్” టెక్సాస్ నగరము నందు గల సమావేశ మందిరము వేదికగా ‘ న భూతొ నభవిష్యత్ ‘అన్నట్లుగా నిర్వహించబడింది .”తెలుగు సాహిత్య విమర్శ నాడు -నేడు ” అంశం పై ముఖ్య అతిథి శ్రీ రాచ పాలెం చంద్ర శేఖర రెడ్డి ప్రసంగం మరో ముఖ్య అతిథి డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి ”హరికథా పితామహా ‘అజ్జాడ ఆది భట్ల నారాయణ దాసు ”అంశంపై చేసిన ప్రసంగాలు సాహితీ ప్రియులను విశేషంగా అలరించాయి. తొలుత ”గజాననమ్ భూత గణాధి సేవితం ..” అంటూ ప్రార్ధన గీతాన్ని డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి రాగయుక్తంగా ను వీనుల విందుగాను ఆలపించడంతో సదస్సు ను ప్రారంభించడం జరిగింది.కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత రాచ పాలెం చంద్ర శేఖర రెడ్డి తన ఉపన్యాసాన్ని ప్రారంబిస్తూ సమాజము, సాహిత్యము సాహిత్య విమర్శ ఈ మూడింటి మధ్య విడదీయరాని బంధమున్నదని పేర్కొన్నారు .కథలలో నాటకీయత కన్నా సజీవ చిత్రణ గొప్పగా కనబడాలన్నది తన అభిప్రాయమన్నారు.నిత్యజీవితంలో ప్రతి ఒక్కరికీ ఎదురయ్యే సమస్యలు వాటి పరిష్కార మార్గాలుకళ్ళముందు కదలాడేవిధంగా రచనలుండాలన్నారు .. .సాహిత్యాన్ని కేవలం సౌందర్య ఆస్వాదనగా కాక, సామాజిక మార్పునకు, ప్రజల జీవన విధానానికి అద్దం పట్టే సాధనంగా భావించాలన్నారు ప్రాచీన ప్రబంధాల నుండి ఆధునిక వచన కవితలు, నవలలు, కథానికల వరకు ప్రతి అంశాన్ని శాస్త్రీయమైన దృష్టితో పునర్మూల్యాంకనం చేసినట్లు తెలిపారు. రాయలసీమ సాహిత్యోద్యమాలు,,కరువు ఫ్యాక్షనిజం వర్తమాన రాజకీయాలు వంటి నిర్దిష్ట సమస్యలతో కూడిన సీమ చరిత్రను అక్కడి బతుకుచిత్రాన్ని తన విమర్శలో ప్రత్యేకంగా వెలుగులోకి తెచ్చిన వైనాన్ని కూలంకషంగా చర్చించారు . సాహిత్య విమర్శకు తొలి ఆనవాళ్లు 1829 నుండి 1950 వరకు ఒక దశకు చేరుకున్నట్లు తెలియచేసిన చంద్రశే ఖర రెడ్డి తెలుగు సాహిత్య విమర్శ చరిత్రను, వివిధ దశలుగా, వివిధ రీతులల్లో ఎలా పరిణామం జరిగిందో సంక్షిప్తంగా అయినప్పటికీ మనసుకు హత్తుకునేలా సమన్వయించారు.ఏ ప్రక్రియ కైనా ఎదుగుదలకు కొలమానం లేదని ఉటంకిస్తూ తెలుగు సాహిత్య విమర్శలో జరిగిన కొన్ని అద్భుతాలుగా గురజాడ అప్పారావు గారి ఐదు కథలకు ఐదువందల పుటల విమర్శలు ,కన్యాశుల్కం పై ఐదువేల పుటల విమర్శలు వచ్చినట్లు పేర్కొన్నారు . ఎప్పుడూ విమర్శకులు ఉండాల్సిందేనని కవి తిక్కన అన్నట్లు పేర్కొన్నారు .   కట్టమంచిరామలింగారెడ్డి , కొడవగంటి కుటుంబరావు ,కందుకూరి వీరేశలింగం , దువ్వూరి రామిరెడ్డి, కోరాడ రామకృష్ణయ్య, కురుగంటి సీతారామయ్య, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి సాహిత్య విమర్శకులను స్పృశించిన చంద్రశేఖర రెడ్డి ఆలంకారిక విమర్శ , కవిజీవిత సమన్వయ విమర్శ, తులనాత్మక విమర్శ, మార్క్సిస్టు విమర్శ, చారిత్రక విమర్శ మొదలైన పద్ధతుల్లో సాహిత్య విమర్శలో కృషి చేసిన విమర్శకుల దృక్పథాలను చక్కగా విశ్లేషణ చేశారు.ప్రాంతీయ అస్తిత్వ వాదన మొదలుకొని ఆధునిక సాహిత్యంలో వచ్చిన స్త్రీవాద, దళితవాద సాహిత్యాన్నీ, ఆ విమర్శ యొక్క తీరు తెన్నులను సమగ్రంగా తెలియజేశారు. సాహిత్య విమర్శకుడికి ఉండవలసిన లక్షణాలను సమన్వయిస్తూ, సమకాలీన సాహిత్యంలో వెలువడుతున్న విమర్శ ల భావ జాలాన్ని ఎలా అధ్యయనం చేయాలో సూచించారు.
సాహిత్య విమర్శ అనేది నిరంతర ప్రక్రియ అనీ ,సాహిత్య విమర్శ ఎవరు ఎప్పుడుచేసినా సదరు విమర్శకూడా విమర్శకు లోను కావలసిందేనన్నారు.

మరో ముఖ్య అతిథి డాక్టర్ ముప్పవరపు వేంకట సింహాచల శాస్త్రి మాట్లాడుతూ హరికథా గానంతో విజయనగర ఖ్యాతిని యావత్ ప్రపంచానికి తెలియజేసిన కీర్తిశేషులు ఆదిభట్ల నారాయణ దాసు చిరస్మరణీయులని పేర్కొన్నారు . అజ్జడ ఆదిభట్ల నారాయణ దాసు రక్తాక్షి నామ సంవత్సరము 1864 ఆగష్టు 31న అజ్జాడయను గ్రామమందున (ప్రస్తుతం విజయనగరం జిల్లా) ఆదిభట్టకులమందు భరద్వాజస గోత్రమున వేంకటచయన, లక్ష్మీనరసమాంబలకు జనియించిన పుణ్యమూర్తి అనీ కవిత్వం, సంగీతం, నాట్యం అనే మూడు రంగాలలోనూ తనకున్న ప్రతిభను జోడించి తయారుచేసుకున్న ”హరికథ” కళను నారాయణదాసు అత్యున్నత శిఖరాలకు తీసుకొనిపోయారనీ తెలియ చేశారు.ఋగ్వేదాన్ని స్వరసహితంగా అచ్చ తెనుగులోనికి అనువదించి వేదంలోని విజ్ఞానాన్నీ, మంత్రమహిమని తెలుగువారికి తెలిపిన నారాయణదాసు ఆంగ్ల షేక్స్పియర్ నాటక రంగములోని ఘట్టములను హృద్యముగా మనభాషలోకి అనువదించారని తెలిపారు .మనదేశంలో హరికథారచనకు, ప్రచారానికి మార్గదర్శకులు. పంచముఖి, షణ్ముఖివంటి అసాధ్యములైన తాళములలో రచనలుచేసి గానం చేసిన నారాయణ దాసు ‘ఆట పాట మాట మీటల మేటి’ గా ప్రసిద్ధినొందినట్లు తెలిపారు . జానకీశపథము, రుక్మిణీకళ్యాణము, గజేంద్రమోక్షము, ప్రహ్లాదచరిత్ర, ధ్రువోపాఖ్యానము, మార్కండేయోపాఖ్యానము, భీష్మచరిత్రము, సావిత్రీచరిత్రము , యదార్థ రామాయణము మున్నగునవి హరికథలనూ , శ్రీరామచంద్రశతకము, కాశీశతకమువంటి శతకములను , ఉమర్ ఖయాం, బాటసారి వంటి కావ్యములను , జగజ్జ్యోతియను వేదాంత గ్రంథమును, తారకమను శృంగార ప్రబంధమును, ‘నవరసతరంగిణి’ అను సంగీతశాస్త్ర గ్రంథమును,యదార్ధ రామాయణమును,హనుమత్సందేశమును రచించిన నారాయణ దాసు గొప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి అని తెలిపినారు.ప్రముఖ గాయకులు డాక్టర్ మంగళం పల్లి మురళీకృష్ణ తన ఎనిమిదవ ఏటనే నారాయణ దాసు వద్ద ఆశీస్సులు పొందినట్లు తెలియచేశారు.‘హరికథా’ ప్రక్రియద్వారా ఆనందం కల్పిస్తూ పురుషార్థ సాధన కవసరమైన విజ్ఞానాన్ని తెలుగు రాష్ట్రముల నాలుగు చెరగులా పండిత పామరులందరికి సుమారు ఆరు దశాబ్దాలకుపైగా పంచిపెట్టి సహస్ర చంద్ర దర్శనముచే చరితార్థుడై సిద్ధినొందిన నారాయణదాసు మనకు చిరస్మరణీయుడు మరియు సదా స్మరణీయుడు అని పేర్కొనడం జరిగింది. డాక్టర్ ముప్పవరపు వేంకట సింహాచల శాస్త్రి తన మధుర కంఠం తో పద్యాలు కీర్తనలు ఆలాపన చేసిన పుడు అందులో లయబద్ధమైన సంగీతం, సాహిత్య స్పష్టత మరియు భక్తి భావాల సమ్మేళనం కనిపించింది. నిజం చెప్పాలంటే వారు తన అద్భుతమైన గాన మాధుర్యం తోను , వాక్చాతుర్యంతోను వీక్షకులను రంజింపచేశారని చెప్పక తప్పదు.నేటి సాహితీ సదస్సును ఆద్యంతం తిలకించిన డాక్టర్ తోటకూర ప్రసాద్ డాక్టర్ శ్రీనివాస రెడ్డి సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ డాక్టర్ బల్లూరి ఉమాదేవి డాక్టర్ నరసింహారెడ్డి ఊరిమిండి , సతీష్ బండారు ,జయదేవ్ మెట్టుపల్లి వెంకట్ కొత్తూరు మద్దుకూరి చంద్రహాస్, సురేష్, అనంత్ మల్లవరపు , కమలాకర్ దేవరకొండ ,రాజారెడ్డి,లెనిన్ వేముల , ఆర్ జె శ్రీనివాసులు ,గుండ్లపల్లి రాజేంద్ర ప్రసాద్ ,గోవర్ధన రావు నిడిగంటి ,ఆచార్య అయ్యల సోమయాజులు,నవీన్ గోదావర్తి ., విజయ లక్ష్మి కందిబండ మొదలైన సాహితీ ప్రియులు నేటి ముఖ్య అతిథులైన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి గారినీ డాక్టర్ ముప్పవరపు వేంకట సింహాచల శాస్త్రిగారిని అభినందిస్తూ తమతమ స్పందనలను తెలియచేశారు .అనంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు మాధవి లోకిరెడ్డి తరపున సంస్థ ఉత్తరాధ్యక్షులు ఉదయ్ కిరణ్ నిడిగంటి ,సంస్థ సమన్వయ కర్త దయాకర్ మాడ డాక్టర్ ప్రసాద్ తోటకూర ,డాక్టర్ శ్రీనివాసరెడ్డి వంటి అనేకమంది సాహితీ ప్రియుల సమక్షంలో నేటి ముఖ్య అతిథులకు టాంటెక్స్ సంస్థ సమర్పించిన సన్మాన పత్ర జ్ఞాపిక ను చదివి వినిపించి పుష్ప గుచ్చాలతోను దుశ్శాలువాలుతోను ఘనంగా సన్మానించడం జరిగింది.
డాక్టర్ ప్రసాద్ తోటకూర,డాక్టర్ నరసింహ రెడ్డి ఊరిమిండి,శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ,డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ ,అనంత్ మల్లవరపు సతీష్ బండారు,చిన్న సత్యం వీర్నాపు వంటి సంస్థ పూర్వ అధ్యక్షులతో పాటు,,డాక్టర్ శ్రీనివాసరెడ్డి,చంద్రహాస్ మద్దుకూరి, రాజా రెడ్డి, శ్రీనివాస్ రాజు , లెనిన్ బండ, లెనిన్ వేముల, కిరణ్మయి గుంట,డాక్టర్ బల్లూరి ఉమాదేవి ,శ్రీమతి విజయ లక్ష్మి కందిబండ ,గోవర్ధనరావునిడిగంటి,గుత్తా హరి.ఎస్ నాయుడు .రమణి,లలిత ,పవన్,కె ఏ మూర్తి , కె వీ ఫణి రాజ కుమార్ ,ప్రకాష్ తిమ్మనాపురం వంటి అనేక మంది సాహితీ ప్రియులు పాల్గొని వీక్షించడంతో సదస్సు విజయవంతమైంది. వందన సమర్పణ గావించిన దయాకర్ మాడ సంస్థ పూర్వాధ్యక్షులకూ సంస్థ ఔన్నత్యానికి ఆర్ధికంగా తోడ్పడుతున్న దాతలకూ ఇంకా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలియ చేశారు. నేటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం టాంటెక్స్ ప్రస్తుత అధ్యక్షులు మాధవి లోకిరెడ్డి, సంస్థ ఉత్తరాధ్యక్షులు ఉదయ్ కిరణ్ నిడిగంటి సమన్వయ కర్త దయాకర్ మాడా సంస్థ పాలక మండలి మరియు అధికార కార్యవర్గ బృందం సభ్యులు అభినందనీయులు.

Social Share Spread Message

Latest News