సిలికానాంధ్ర 25 ఏండ్ల రజతోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. అమెరికాలో తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర సంస్థ మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. సిలికానాంధ్ర తన పాతికేళ్ల ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలిరోజు కార్యక్రమంలో భాగంగా డ్రైరన్ తో పాటు తెలుగు దనం ఉట్టిపడేలా గురు వందనం నిర్వహించినట్లు సిలికానాంధ్ర అధ్యక్షురాలు సత్య ప్రియ తణుగుల తెలిపారు. రజతోత్సవ సంబరాలను స్పాన్సర్లను సన్మానించేందుకు వారి పట్ల అభిమానం చాటు కొనేందుకు గురు వందనం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బ్యాంకెట్ డిన్నర్ లా కాకుండా తెలుగింటి రుచులతో విందు భోజనం ఏర్పాటు చేశామని తెలిపారు. సిలికానాంధ్ర సైనికుల్లో చాలామంది ఐటీ కంపెనీల సిఈఓ లు , డాక్టర్ లు, ఇంజనీర్లు ఉన్నట్లు ఆమె తెలిపారు.

సిలికానాంధ్ర పాతికేల్ల ప్రస్థానంలో ఆనంద్ కూచిబొట్ల పాత్ర వెలకట్టలేనిదని వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఆయన సిలికానాంధ్ర ఎదుగుదలకు ఎనలేని కృషి చేశారని తెలిపారు. ఆయన పర్యవేక్షణలో వైభవంగా
జరిగే ఈ వేడుకలకు ఇండియా నుండి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు వచ్చారని తెలిపారు. డాక్టర్ హనుమ రెడ్డి లక్కిరెడ్డి , ప్రముఖ కవి సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు , స్థానిక వైద్యులతో పాటు, పలువురు ఎన్నారై లు విచ్చేశారని తెలిపారు. ఈ వేడుకల కోసం ఆంధ్ర నుండి గోలి సోడాలను భీమవరం రుచులు రెస్టారెంట్ తెప్పించి వచ్చిన వారికి రుచి చూపించారు.

విదేశాల్లో తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర సంస్థ 25 ఏండ్ల రజతోత్సవ సంబరాలు ఘనంగా ముగిశాయి. సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకల్లో మూడు గిన్నిస్ వరల్డ్ రికార్డులు సొంతం చేసుకుంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓక్ల్యాండ్ ఎరీనాలో నిర్వహించిన రజతోత్సవాల సందర్భంగా నిర్వహించిన ‘సంగీతామృతవర్షిణి’, ‘శతక శంఖారావం’, ‘లయామృతవర్షిణి’ కార్యక్రమాలు గిన్నిస్ బుక్లో చోటు దక్కించుకున్నాయి.’సంగీతామృతవర్షిణి’ కార్యక్రమంలో భాగంగా అన్నమయ్య, త్యాగయ్య, రామదాసు, ముత్తుస్వామి దీక్షితార్ రచించిన కీర్తనలను 1,014 మంది గాయకులు ఆలపించారు.ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసురాలు సుధా రఘునాథన్ ఈ కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ‘లయామృతవర్షిణి’ కార్యక్రమంలో తిరుచ్చి శంకరన్, డాక్టర్ పత్రి సతీష్ సమన్వయంతో 286 మంది మృదంగ విద్వాంసులు అద్భుతమైన లయ విన్యాసాలను ప్రదర్శించారు.’శతక శంఖారావం’లో భాగంగా వేమన, సుమతీ శతకాల నుంచి ఎంపిక చేసిన 18 పద్యాలను 1,712 మంది ఒకేసారి పఠించి మరో గిన్నిస్ రికార్డును నెలకొల్పారు.


ఈ మూడు కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక గిన్నిస్ ధ్రువపత్రాలను గిన్నిస్ ప్రతినిధి మైకేల్ ఎంప్రిక్ సిలికానాంధ్ర నిర్వాహకులకు అందజేశారు.దీంతో మొత్తం 13 గిన్నిస్ వరల్డ్ రికార్డులను సాధించినట్లు సిలికానాంధ్ర సంస్థ నిర్వాహకులు తెలిపారు.


తెలుగు మూలాలను కాపాడుతున్నారు :
తెలుగు మూలాలను మరిచిపోకుండా కాపాడడంతో పాటు భవిష్యత్తు తరాలకు సిలికానాంధ్ర సంస్థ అందిస్తున్నదని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శాన్ ఫ్రాన్సిస్కో కౌన్సిల్ జనరల్ డాక్టర్. శ్రీకర్ రెడ్డి కొనియాడారు. పద్య ఉద్యమానికి సిలికానాంధ్ర సంస్థ వ్యవస్థాపకుడు ఆనంద్ కూచిబొట్ల శ్రీకారం చుట్టారని ప్రముఖ రచయిత జొన్నవిత్తుల రామ లింగేశ్వరరావు అభినందించారు. భారతీయ కళలకు సిలికానాంధ్ర చిరునామాగా నిలిచిందని ఇల్లినాయిస్ కాంగ్రెస్ మెన్ రాజా కృష్ణమూర్తి అన్నారు. మన వారసత్వ సంపద గొప్ప తనాన్ని తెలియజేయాలనే సంకల్పంతో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సాంస్కృతిక చారిత్రక అంశాలను ప్రదర్శించామని ఆనంద్ కూచిబొట్ల అన్నారు. రజతోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించిన వారికి సిలికానాంధ్ర అధ్యక్షురాలు తనుగుల సత్యప్రియ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యుడు డాక్టర్. హనిమి రెడ్డి లక్కిరెడ్డి, మాజీ ఎంపీ డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ , మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య,ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ తదితరులను జీవన సాఫల్య పురస్కారాలతో సత్కరించారు.




































