హీరో ధనుష్ మరో ప్రతిష్టాత్మక బాలీవుడ్ చిత్రానికి సిద్ధమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు పీ.ఎస్. మిత్రన్ రూపొందించనున్నారు. బాలీవుడ్‌లో ఆయనకు ఇదే తొలి చిత్రం కానుంది. మైథలాజికల్ అంశాలను జంగిల్ అడ్వెంచర్ కథతో మేళవిస్తూ ఈ సినిమాను భారీ స్థాయిలో రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం చిత్రబృందం స్క్రిప్ట్ పనులను పూర్తి చేసే దశలో ఉంది.

ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర కోసం స్టార్ నటి కరీనా కపూర్ ఖాన్‌ని మేకర్స్ సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. కథ నచ్చడంతో కరీనా కూడా ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం లేదా కరీనా నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నట్లు సమాచారం. స్క్రిప్ట్ విషయంలో సంజయ్ లీలా భన్సాలీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని, పలుమార్లు మార్పులు చేసి కథను ఫైనల్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 2027 ప్రారంభంలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.





























