Skip to main content

Namaste NRI

నిర్మాత బండ్ల గణేష్ కుమార్తె వివాహం .. తరలివచ్చిన సినీ, రాజకీయ ప్రముఖులు

టాలీవుడ్ ప్రముఖ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్ కుమార్తె జనని, సూర్య తేజల వివాహ మహోత్సవం హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగింది.ఈ శుభకార్యానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రత్యేకంగా హాజరయ్యారు. వేదికపై నూతన వధూవరులు జనని, సూర్యతేజలపై అక్షింతలు వేసి వారిని ఆశీర్వదించారు. ముఖ్యంగా, చంద్రబాబు దంపతుల చేతుల మీదుగానే వరుడు సూర్యతేజ తాళిని అందుకుని మాంగళ్యధారణ చేయడం ఈ పెళ్లి వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ శుభకార్యానికి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి స్వయంగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకకు తరలివచ్చి వధూవరులకు శుభాకాంక్షలు అందజేశారు. రాజకీయ మరియు సినీ వర్గాల ముఖ్య నేతల కలయికతో ఈ వివాహ మహోత్సవం ఎంతో కోలాహలంగా మారింది.

ఈ వివాహ వేడుకకు టాలీవుడ్ నుంచి పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, కింగ్ నాగార్జున, డాక్టర్ రాజశేఖర్-జీవిత దంపతులు, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం వంటి సీనియర్ నటులతో పాటు ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకులు అనిల్ రావిపూడి, శ్రీను వైట్ల తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అంతేకాకుండా ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సతీమణి అన్నా కొణిదెల కూడా వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. సినీ, రాజకీయ రంగానికి చెందిన ప్రముఖుల రాకతో బండ్ల గణేశ్ ఇంట పెళ్లి వేడుక కంటికి పండుగలా సాగింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events