సౌదీ అరేబియా, టర్కీ లతో కలిసి పాకిస్థాన్ ఏర్పాటుచేసిన రక్షణ ఒప్పందం కార్యాచరణలోకి రావడంపై ఇరాన్ తీవ్ర స్వరంతో స్పందించింది. యెమెన్ విషయంలో జోక్యం చేసుకుంటే ఆ ప్రాంతంపై తీవ్ర దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరించింది. ముఖ్యంగా అమెరికాతో చర్చల విషయంలో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్ ఈ కూటమిలో చేరడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. సౌదీ మౌలిక సదుపాయాలపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడులు పెరగడంతో ఈ త్రైపాక్షిక ఒప్పందం అక్టోబర్ 5 నుంచి కార్యాచరణ దశలోకి వచ్చింది. సౌదీ అరేబియాకు మద్దతుగా టర్కీ, పాకిస్థాన్ చర్యలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది పాకిస్థాన్ సైనికులను సౌదీకి పంపవచ్చనే దానిపై ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ స్పందించారు.

ఈ నేపథ్యంలో యెమెన్ విషయంలో ఏ దేశం జోక్యం చేసుకున్నా ఆ ప్రాంతంలో అవాంఛనీయ పరిణామాలు తప్పవని బఘాయీ స్పష్టంచేశారు. అయితే టర్కీ కంటే పాకిస్థాన్‌పైనే ఇరాన్ తన విమర్శలను ఎక్కువగా కేంద్రీకరించింది. టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య మధ్యవర్తిగా ఇస్లామాబాద్ పోషిస్తున్న ప్రముఖ పాత్రే ఇందుకు కారణం.















