అమెరికాలో దాదాపు 27 ఏళ్లుగా నివసిస్తున్న భారత సంతతి మహిళ వెంకట నర్సమాంబ వాసంశెట్టికి ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి అనూహ్య సమస్యలు ఎదురయ్యాయి. చట్టబద్ధమైన శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డు) ఉన్నప్పటికీ, అమెరికా ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ)అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను అమెరికా నుంచి బహిష్కరించేందుకు సంబంధించిన కేసును కొన్ని నెలల క్రితమే ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి కొట్టివేయడం గమనార్హం.

వాసంశెట్టి 2013 నుంచి అమెరికాలో చట్టబద్ధమైన శాశ్వత నివాసిగా కొనసాగుతున్నారు. ఆగస్టు 11న షెడ్యూల్ ప్రకారం ఐసీఈ కార్యాలయంలో చెక్-ఇన్ కోసం వెళ్లారు.అయితే అక్కడే అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని జార్జియాలోని నిర్బంధ కేంద్రానికి తరలించారు.ఈ పరిణామంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాసంశెట్టిపై బహిష్కరణకు సంబంధించిన కేసును ఇమ్మిగ్రేషన్ న్యాయమూర్తి మే 19న కొట్టివేశారు.ఈ కేసులో తమ ఆరోపణలకు మద్దతుగా అవసరమైన ఆధారాలను నిర్ణయించిన గడువులోగా సమర్పించడంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్) విఫలమైంది.దీంతో న్యాయమూర్తి కేసును డిస్మిస్ చేశారు. అయినప్పటికీ ఆగస్టు 11న ఆమెను ఐసీఈ అధికారులు నిర్బంధించడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.















