ఒక అమెరికా సైనికుడిని పట్టుకొన్నా, చంపినా రూ.28 లక్షలు బహుమతిగా అందిస్తామని ఇరాన్ సైన్యం ప్రకటించింది. ఈ పని మహిళలు చేస్తే రెట్టింపు మొత్తం కానుకగా అందిస్తామని తెలిపింది. టెహ్రాన్‌లోని ఓ కార్యక్రమంలో ఇరాన్ సైన్యాధిపతి అమీర్ హతామీ ఈ ప్రకటన చేశారు. దీన్ని ఆయన ఆర్థిక జీహాద్ గా అభివర్ణించారు. దేశ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్న ప్రజల అభ్యర్థన మేరకు పథకాన్ని ప్రవేశపెట్టినట్టు ఆయన తెలిపారు.

పశ్చిమాసియాను వీడాలని అమెరికాను మరోసారి ఆయన కోరారు. వాళ్లకు పర్షియన్ గల్ఫ్‌లోకి, ఓమన్ గల్ఫ్‌లోకి, హొర్ముజ్ జల సంధిలోకి ప్రవేశించేందుకు ఇంకెంత మాత్రం అనుమతి లేదు అని ఆయన అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న సంఘర్షణ అమెరికా సైనిక ఆధిపత్యాన్ని బలహీనపరిచిందని, పలు దేశాలు ప్రత్యామ్నాయ భద్రతా ఏర్పాట్లను అన్వేషించేలా పురికొల్పిందని పేర్కొన్నారు.















