హెచ్-1బీ వీసా దరఖాస్తులపై విధించిన లక్ష డాలర్ల ఫీజు విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈ వీసాల ద్వారా విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థల నుంచి మరో ఏడాదిపాటు ఫీజు వసూలు చేసేలా ఆదేశాలు ఇచ్చారు. తాజాగా దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకాలు చేశారు.

సాధారణంగా ఈ వీసా దరఖాస్తుల కోసం అయ్యే ఖర్చును కంపెనీలు భరిస్తాయి. గతంలో ఇందుకోసం 2 వేల నుంచి 5 వేల డాలర్ల వరకు ఖర్చు కాగా.. గత ఏడాది సెప్టెంబరులో ఈ వీసా ఫీజును ట్రంప్ సర్కార్ ఏకంగా లక్ష డాలర్లకు పెంచేసింది. ఆ నిబంధన తీసుకువచ్చి ఏడాది సమయం పూర్తవుతున్న సమయంలో ట్రంప్ ప్రభుత్వం తాజాగా మరో 12 నెలలపాటు ఈ పెంపును పొడిగించింది. 2025లో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఐటీ సేవలను అవుట్సోర్సింగ్ ఇస్తున్న కంపెనీల హెచ్-1బీ రిజిస్ట్రేషన్లలో 92 శాతం తగ్గుదల నమోదైందని అమెరికా ప్రభుత్వం పేర్కొన్నది.














