కృత్రిమ మేథస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పేరు పెట్టారు. ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కు బదులుగా సూపర్ ఇంటెలిజెన్స్ (ఎస్ఐ) అనే పదాన్ని వాడాలని నిర్ణయించారు. ఆర్టిఫిషియల్ అంటే నకిలీ అన్న భావన వస్తోందని, ఈ సాంకేతికత నిజమైనదే కాబట్టి ఆ పేరు సరైంది కాదని ట్రంప్ అన్నారు.

న్యూయార్క్లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగిస్తూ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ఇకపై అమెరికా ప్రభుత్వ పత్రాల్లో సూపర్ ఇంటెలిజెన్స్ అనే పదమే కనిపిస్తుందని చెప్పారు. ఇతర దేశాలు కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏఐపై ప్రపంచవ్యాప్తంగా నియంత్రణ తీసుకురావాలన్న ప్రయత్నాలను ట్రంప్ వ్యతిరేకించారు. సాంకేతికత అభివృద్ధిని అడ్డుకునే అంతర్జాతీయ వ్యవస్థను అమెరికా అంగీకరించబోదని స్పష్టం చేశారు.















