రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో భారత్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని, శిక్షార్హమైన టారిఫ్‌లు విధించవద్దని అమెరికా కు ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ జేపీ మోర్గాన్ చేజ్ సీఈఓ జేమీ డైమన్ సూచించారు. తొందరపడి ఏకపక్షంగా ముందుకెళ్తే అది కేవలం భారత్‌కే కాకుండా యావత్ ప్రపంచ చమురు మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో పునరాలోచన చేయాలని సలహా ఇచ్చారు.

జేపీ మోర్గాన్ ఇండియా ఇన్వెస్టర్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడారు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురుపై టారిఫ్‌లు విధించే ముందు అమెరికా ప్రభుత్వం క్షుణ్ణంగా ఆలోచించాలని అన్నారు. భారత రిఫైనరీలు రష్యా చమురును ఎలా వినియోగిస్తున్నాయో, వాటి అవసరాలేమిటో వాషింగ్టన్ ముందుగా అర్థం చేసుకోవాలని హితవు పలికారు.

భారత్‌పై ఆంక్షలు విధించే బదులు, అమెరికా అధికారులు ఢిల్లీతో కూర్చుని అన్ని వాస్తవాలను చర్చించాలని సూచించారు. రష్యాతో పోరాడేందుకు చేయాల్సినవి చేస్తూనే భారత్‌ను, ప్రపంచ చమురు మార్కెట్లను శిక్షించకుండా అమెరికా వ్యవహరిస్తుందని నేను ఆశిస్తున్నా అని జేమీ డైమన్ పేర్కొన్నారు. చమురుపై టారిఫ్‌లు విధించడం సరైన నిర్ణయమా, కాదా? అనే దానిపై తనకు పూర్తి స్పష్టత లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.















