అమెరికాలో తెలుగు సమితి ఆఫ్ నెబ్రాస్కా (టీఎస్ఎన్) ఆధ్వర్యంలో సెప్టెంబర్ 19న ఒమాహాలోని సీయెనా ఫ్రాన్సిస్ హౌస్ లో నిర్వహించిన ఫీడ్ ది నీడ్ – యూత్ ఛారిటీ & ఫుడ్ డ్రైవ్ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో 400కు పైగా భోజనాలను అవసరంలో ఉన్న వారికి వడ్డించారు. యువతతో పాటు వారి కుటుంబ సభ్యులు, టీఎస్ఎన్ ఎగ్జిక్యూటివీ సభ్యులు పాల్గొన్నారు. టీఎస్ఎన్ అధ్యక్షులు కొల్లి , ఛారిటీ కమిటీ అధ్యక్షులు ధనారావు గొట్టిపాటి, కమ్యూనిటీ కమిటీ అధ్యక్షులు అవినాష్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుల సమన్వయంతో కార్యక్రమం జరిగింది.

భోజన సేవతో పాటు యువతకు అక్కడి జీవన పరిస్థితులను ప్రత్యక్షంగా పరిచయం చేసేందుకు ప్రత్యేక ఫెసిలిటీ టూర్ ఏర్పాటు చేశారు. టీఎస్ ఎన్ అధ్యక్షులు కొల్లి విజ్ఞప్తి మేరకు మహిళలు, పురుషుల షెల్టర్ విభాగాలు, నివాస ప్రాంతాలు, లాండ్రీ ఫెసిలిటీస్, తదితర ప్రదేశాలను యువతకు సియెనా ఫ్రాన్సిస్ హౌస్ చైర్ మిసెస్ లిల్లీ చూపించారు.


అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన యువత, తమకు తల్లిదండ్రులు, కుటుంబం, నివసించేందుకు ఇల్లు ఉండటం ఎంత అదృష్టమో భావోద్వేగంతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఒక యువ వాలంటీర్ నేను పెద్దయ్యాక వీరు అనుభవిస్తున్న బాధను తగ్గించగల పరిష్కారాన్ని కనుగొనాలని ఉంది అని చెప్పడం మిగతా యువతను కూడా కదిలించింది.


తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు యువతలో సేవాభావం, సానుభూతి, కృతజ్ఞత, సామాజిక బాధ్యత పెంపొందించడం టీఎస్ఎన్ లక్ష్యాల్లో ఒకటని నిర్వాహకులు తెలిపారు. రాబోయే సంవత్సరాల్లో ప్రతి త్రైమాసికంలో ఇటువంటి సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి మరింత మంది యువతను భాగస్వాములను చేయాలని ఆకాంక్షించారు. సేవను ఒక్కరోజు కార్యక్రమంగా కాకుండా, జీవితాంతం కొనసాగించే విలువగా యువత స్వీకరించాలన్నదే ఫీడ్ ద నీడ్ కార్యక్రమం అందించిన సందేశం.















