నితిన్ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అలియాస్ రుక్మిణి. మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని అగ్ర హీరో నాని సమర్పణలో ఆయన సోదరి దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ప్రారంభిస్తూ రుక్కు రుక్కు రుక్మిణి అనే తొలి పాటను విడుదల చేశారు. విజయ్ బుల్గానిన్ స్వరపరచిన ఈ పాటను పూర్ణాచారి రచించారు.

అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఇందులో మధ్యతరగతి యువకుడైన కృష్ణగా నితిన్, స్కూల్ టీచర్ రుక్మిణి పాత్రలో కథానాయిక ఆఫియా సయ్యద్ కనిపించారు. పాటలోని విజువల్స్, నాయకానాయికల మధ్య కెమిస్ట్రీ ప్రధానాకర్షణగా నిలిచింది. తకధిమి తానా అని ఆడుకోకే బంగారం, తికమక చేసి అలా వెళ్లిపోకే బంగారం, బహుమతిలాగా నిన్ను చూసుకుంటా బంగారం, రుక్కు రుక్కు రుక్మిణి.. ఒప్పేసుకో నా రాణి అంటూ చక్కటి భావాలతో ఈ పాట సాగింది. డిసెంబర్ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: విజయ్ బుల్గానిన్, రచన-దర్శకత్వం: మురళీకాంత్ దేవసోత్.















