హుషారు చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రం హుషారు-2. రాహుల్ రామకృష్ణ, అశోక్ గల్లా, రవి ఆంథోని, దినేష్‌తేజ్, శశిధర్ తదితరులు ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. ఈ చిత్ర టీజర్‌ను పీపుల్స్‌స్టార్ ఆర్.నారాయణమూర్తి ఆవిష్కరించారు. ఆయన ఈ సినిమాలో కీలక పాత్రను పోషిస్తుండటం విశేషం. టీజర్ చివరలో తమ్ముళ్లు వేట మొదలెడదామా అంటూ ఆయన విప్లవ నాయకుడి పాత్రలో కనిపించి అందరినీ సర్‌ప్రైజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ దర్శకుడు శ్రీహర్ష ఈ సినిమాలో నాకు గొప్ప పాత్ర ఇచ్చారు. ప్రేక్షకుల్ని నవ్విస్తూనే ఆలోచింపజేసే కథ ఇది. నిరుద్యోగ సమస్య గురించి చర్చించడంతో పాటు యువత స్వతంత్రంగా, ఆత్మాభిమానంతో బతకాలనే సందేశాన్ని అందించారు. ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు.

నిజ జీవితంలో తాను ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ఈ సినిమా తీశానని, నారాయణమూర్తిగారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని, ఆయన కనిపించే సన్నివేశాలు హైలైట్‌గా నిలుస్తాయని దర్శకుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.















