ప్రముఖ దర్శకుడు, నిర్మాత వేణు ఊడుగుల సమర్పణలో వస్తున్న తాజా చిత్రం చంద్రయాన్. టాలీవుడ్లో సరికొత్త కామెడీ అడ్వెంచర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రాకెట్ రివీల్ (లాంచ్) వేడుక హైదరాబాద్ లోని మాదాపూర్ రెట్రో డ్రైవ్-ఇన్ వేదికగా అత్యంత వైభవంగా జరిగింది. ఈ ప్రత్యేక వేడుకకు టాలీవుడ్ దర్శకుడు సంకల్ప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు.

ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, శ్రీనాథ్ చంద్రశేఖర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన రాకెట్ లాంచ్ ఈవెంట్ సినీ వర్గాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక సరికొత్త భావోద్వేగాలు, నవ్వులు పంచే వినోదాత్మక అడ్వెంచర్‌గా వస్తున్న ఈ చంద్రయాన్ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది. వేణు ఊడుగుల సమర్పిస్తుండటంతో ఈ సినిమాపై టాలీవుడ్లో అంచనాలు భారీగానే నెలకొన్నాయి.















