వెంకటేశ్ హీరోగా రూపొందిన ఫ్యామిలీ థ్రిల్లర్ ఆదర్శకుటుంబం -హౌస్ నెం ఏకే 47. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో వెంకటేశ్ మాట్లాడారు. 25ఏళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో పనిచేశాను. మా కాంబినేషన్ అంటే అంచనాలుంటాయి. అందుకు తగ్గట్టే ఆల్ ఎమోషన్స్‌తో మంచి స్క్రిప్ట్ తెచ్చాడు. కథ విని చాలా ఆనందించా. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. ఇది నాకెరీర్‌లోనే వెరీవెరీ స్పెషల్ మూవీ. పనిచేసిన వారంతా ప్రాణం పెట్టారు. తప్పకుండా సినిమా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా అని వెంకటేశ్ ఆశాభావం వెలిబుచ్చారు.

చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కుటుంబాన్ని మనం సెలక్ట్ చేసుకోం. అది ఇవ్వబడుతుంది. అలా ఇవ్వబడిన బంధాలను కాపాడుకోవడానికి నలుగురు వ్యక్తులు ఎంతదూరం వెళ్లారు? సామాన్యుడు తెగిస్తే ఎంతదూరం వెళ్తాడు? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. కలియుగంలో మనుషులు ఎలా ఉంటారో, మనస్తత్వాలు ఎలా ఉంటాయో ఉద్ధవగీతలో కృష్ణుడు చెప్పారు. మనుషుల్లో ఆశ, కోరిక, కలహప్రియత్వం ఎక్కువవుతాయని ఆనాడు ఆయన చెప్పినట్టే, నేడు ప్రపంచం నడుస్తున్నది. ఆ పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండేది కుటుంబం మాత్రమే.

అది కూడా దూరమైతే మనుషులు ఎవరికోసం బతకాలి? అందుకే కుటుంబ బంధాల గురించి పదేపదే చెప్పే ప్రయత్నం చేస్తుంటాను. కుటుంబం లోతైన బావి లాంటిది. మన దాహాన్ని, ఆర్తిని తీరుస్తుంది. అలాంటి కుటుంబాల గురించి చెప్పడానికి సరైన మనిషి ఎవరున్నారు? వెంకటేశ్ తప్ప. ఫ్యామిలీ సినిమాలతో సూపర్‌స్టార్ అవ్వొచ్చని నిరూపించిన వ్యక్తి వెంకటేశ్. పద్మవ్యూహం లాంటి కుటుంబంలోకి అభిమన్యుడిలా వెళ్లి, బయటకు రావడం తెలియక చనిపోతారా? అర్జునుడిగా వెళ్లి, గెలిచి బయటకొస్తారా? అని చెప్పేదే ఈ సినిమా అని త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పారు. ఇంకా నిర్మాత ఎస్.రాధాకృష్ణ, కథానాయికలు శ్రీనిధిశెట్టి, నివేద పేతురాజ్, సంగీత దర్శకుడు తమన్, కమెడియన్ సత్య, నటుడు బ్రహ్మాజీ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.















