నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్) అమెరికా, తెలంగాణ లో సేవా కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, సాంస్కృతిక వేడుకలను నిర్వహించింది. అధ్యక్షుడు రాజ్ అల్లాడ నాయకత్వంలో దిగ్విజయంగా సాగుతున్న ఈ కార్యక్రమాలకు సంస్థ ఛైర్మన్ కిషోర్ కంచర్ల ప్రత్యేక అభినందనలు తెలిపారు.

తెలంగాణలోని ఘట్కేసర్ మండలం మేడిపల్లి గ్రామంలోని మాతృ అభయ ఫౌండేషన్ అనాథాశ్రమానికి నాట్స్ రూ.3 లక్షల విలువైన వంట సామగ్రిని విరాళంగా అందజేసింది. ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల నిర్వహిస్తున్న ఫెస్టివల్స్ ఫర్ జాయ్ కార్యక్రమంతో కలిసి ఈ సేవను చేపట్టగా, సుమ చిన్నారులతో కలిసి ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమ ఐదో వార్షికోత్సవ షీల్డ్‌ను సంస్థ తరఫున సినీ రచయిత సిరాశ్రీ స్వీకరించారు.

న్యూజెర్సీ, మిస్సోరి, డల్లాస్, మిచిగన్, టాంపా ప్రాంతాలలో నాట్స్ భారీ వైద్య శిబిరాలను నిర్వహించింది.ఏడు గంటల పాటు కొనసాగిన ఈ శిబిరంలో డల్లాస్–ఫోర్ట్ వర్త్ పరిసర ప్రాంతాలకు చెందిన 1,000 మందికి పైగా వైద్య సేవలు పొందారు. చాప్టర్ కోఆర్డినేటర్లు కిరణ్ నారే, పవని నున్నా, వైద్య శిబిర కోఆర్డినేటర్లు సౌజన్య రావెళ్ల, కృష్ణ వ్యాకరణం, ఎగ్జిక్యూటివ్ వెబ్ సెక్రటరీ కిషోర్ నారే తదితరులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారు.

అలాగే, న్యూజెర్సీలో UPASA, సాయి దత్త పీఠం సహకారంతో నిర్వహించిన వైద్య శిబిరంలో గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ జనార్ధన్ బొల్లు, కార్డియాలజిస్ట్ డాక్టర్ వెంకట రవి ఎస్. ఆకుల, పీడియాట్రిషన్ డాక్టర్ విజయ నిమ్మల తమ అమూల్యమైన వైద్య సేవలను అందించారు. దేవి మానేపల్లి నాయకత్వంలో తాజాగా ఏర్పాటైన నాట్స్ మిచిగన్ చాప్టర్ తన తొలి ప్రయత్నంగా ఫ్లూ వ్యాక్సినేషన్ శిబిరాన్ని విజయవంతంగా పూర్తి చేయగా, టాంపా చాప్టర్‌లోనూ మరో వైద్య శిబిరం నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కుటుంబ సభ్యులకు క్రమం తప్పకుండా CPR శిక్షణ ఇవ్వడంతో పాటు, భవిష్యత్తులో మరిన్ని నగరాల్లో వైద్య శిబిరాలను విస్తరించనున్నట్లు అధ్యక్షుడు రాజ్ అల్లాడ వెల్లడించారు.

నాట్స్ శాన్ డియాగో చాప్టర్ ఆధ్వర్యంలో అక్వేరియంలో స్వరాభిషేకం పేరిట అత్యంత వైభవంగా భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు. త్యాగరాజు, అన్నమాచార్యులు, భద్రాచల రామదాసు కీర్తనలతో సాగిన ఈ వేడుకకు 100కు పైగా తెలుగు కుటుంబాలు హాజరై సంగీతాన్ని ఆస్వాదించాయి. సాంస్కృతిక కోఆర్డినేటర్ కామ్య శిష్ట్లా, ప్రధాన కోఆర్డినేటర్ ప్రశాంతి ఉడుమూడి, సుష్మ శిష్ట్లా తదితరులు ఈ కార్యక్రమ నిర్వహణలో ప్రత్యేక కృషితో పాటు నూతన సభ్యుడు పవన్ సిరువూరుకు సాదర స్వాగతం పలికారు.

న్యూజెర్సీ చాప్టర్ గుడ్ వైబ్స్ సహకారంతో అక్టోబర్ 30, 2026న ప్రఖ్యాత నేపథ్య గాయని సమీరా భరద్వాజ్ సంగీత కచేరీని అట్టహాసంగా నిర్వహించింది. 500 మందికి పైగా సంగీత ప్రియులు హాజరైన ఈ వేడుకలో సమీరా మధుర గాత్రం ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది.















