కర్ణాటక చిత్రదుర్గలోని ఎస్‌జేఎంఐటీ కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. అమెరికాలోని లాస్ వెగాస్ నగరం ఇందుకు వేదికైంది. ఈ సమ్మేళనంలో సుమారు 200 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 1980లో ప్రారంభమైన ఎస్‌జేఎంఐటీ కళాశాలలో తమకు బోధించిన గురువులు, స్నేహితులతో గడిపిన మరపురాని అపురూప క్షణాలను పరస్పరం గుర్తుచేసుకున్నారు. నాటి సరదా సంఘటనలు, అనుభవాలను పంచుకుంటూ నవ్వులు, పలకరింపులతో సందడిగా మార్చారు.

వృత్తి, కుటుంబ జీవితం, పదవీ విరమణ, భవిష్యత్తు ప్రణాళికలు సహా అనేక అంశాలపై ఆత్మీయంగా ముచ్చటించారు. ఎన్నేళ్లు గడిచినా తమ మధ్య స్నేహబంధం, అనుబంధం చెక్కుచెదరలేదని ఈ సమ్మేళనం మరోసారి చాటిచెప్పిందని తెలిపారు. నిర్వాహకుల సమష్టి కృషి, చక్కటి సమన్వయం, ఆత్మీయ ఆతిథ్యం ఈ సమ్మేళనాన్ని చిరస్మరణీయంగా నిలిపాయన్నారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రీధర్ గోనుగుంట్ల, శ్రీనివాస్ గొంది, వెంకట్ మలపాటి, భక్త బల్లా, మాదల శ్రీనివాస్, ప్రవీణ్ రెడ్డి, పాపి రెడ్డి, శరత్ పున్‌రెడ్డి, వంశీ గరికపాటి, శ్రీనివాస్ రెడ్డి ఎర్ర, చంద్ర రాగ్యారి, కృష్ణ పూర్రులకు పూర్వ విద్యార్థులందరూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ ఆత్మీయ కలయికకు చొరవ తీసుకున్న వెనిగళ్ల రవికుమార్ కృషిని పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు భవిష్యత్తులోనూ కొనసాగాలని ఆకాంక్షించారు. 2028లో మరోసారి ఇలాంటి సమావేశం ఏర్పాటుచేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మధుర జ్ఞాపకాలను హృదయాల్లో పదిలపరచుకొని పూర్వ విద్యార్థులంటూ పరస్పరం ఆనందంగా వీడ్కోలు పలికారు.















