వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కలం పట్టినా, మైక్ పట్టుకున్నా అందులో ఒక కొత్త విషయం కనిపిస్తుంది. తాజాగా నితేశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పౌరాణిక చిత్రం రామాయణ- పార్ట్ 1పై ఆర్జీవీ చేసిన తాజా పోస్ట్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నవంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రంపై వర్మ ప్రశంసల జల్లు కురిపించారు.

సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించిన వర్మ, ఈ సినిమాను సాధారణ భక్తిరస చిత్రాల కోవలోకి నెట్టేయలేమని తేల్చిచెప్పారు. ఇది కేవలం భక్తి సినిమా మాత్రమే కాదని, అదొక ‘భక్తి శక్తి’ అంటూ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. చిత్ర నిర్మాణంలో పడిన ఏనుగంత భారీ శ్రమ ముందు.. వస్తున్న విమర్శలు చాలా చిన్నవని, వాటిని యూనిట్ అస్సలు పట్టించుకోవద్దని సూచించారు.

రాముడి పాత్ర చిత్రీకరణపై వర్మ చేసిన విశ్లేషణ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఇందులో రాముడు కథకు అతీతంగా గాలిలో తేలే దేవుడు కాదని, సర్వనాశనం కాబోతోందని స్పష్టంగా తెలిసినప్పటికీ ధైర్యంగా అడుగు ముందుకు వేసిన ఒక రక్తమాంసాలున్న మనిషిలా దర్శకుడు ఆవిష్కరించారని కొనియాడారు. అంతేకాకుండా, తెరపై కనిపించిన హింస కూడా చర్యల పర్యవసానాల తీవ్రతను బలంగా ప్రతిబింబించిందని పేర్కొన్నారు.

నటీనటుల ప్రదర్శనను ప్రస్తావిస్తూ, రాముడిగా కనిపించిన రణ్బీర్ కపూర్, రావణాసురుడిగా జీవించిన యశ్ అభినయం అద్భుతమని ఆర్జీవీ ప్రశంసించారు. ముఖ్యంగా సీత అపహరణ అనంతరం శూన్యమైన ఆశ్రమంలో రాముడు నిలబడే సన్నివేశాన్ని ఆయన ప్రత్యేకంగా గుర్తుచేశారు. ఆ దృశ్యంలో రణ్బీర్ ప్రదర్శించిన వేదన, ఆ దుఃఖం ఒక అంకగణితంలా మారిన తీరును కెమెరా అత్యద్భుతంగా ఒడిసిపట్టిందని విశ్లేషించారు.

నమిత్ మల్హోత్రా నిర్మాణ సారథ్యంలో రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ కాంబినేషన్లో రూపొందిన ఈ దృశ్యకావ్యం ఇప్పటికే సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రమంలో వర్మ చేసిన ఈ లోతైన సమీక్ష సినిమా స్థాయిని మరింత పెంచుతూ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.















