రాష్ట్రంలో ఇటీవల ముగిసిన స్థానిక సమరంలో కూటమి ప్రభంజనం సృష్టించింది. గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు ఓటర్లు ఏకపక్షంగా ఇచ్చిన తీర్పుతో ఎన్డీయే కూటమి ఘన విజయాన్ని అందుకుంది. ఈ చారిత్రక విజయంపై సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. చారిత్రాత్మక తీర్పునిచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎన్నికల ఫలితాల అనంతరం మీడియా ముందుకు వచ్చిన చంద్రబాబు, ఇది కేవలం రాజకీయ విజయం కాదని, గత రెండున్నరేళ్లుగా తమ ప్రభుత్వం నిబద్ధతతో అందించిన ప్రజాపాలనకు దక్కిన అసలైన గుర్తింపు అని స్పష్టం చేశారు. “ఎప్పుడూ నేను నమ్మే ఒకే ఒక్క సిద్ధాంతం.. మంచి పరిపాలనే నాణ్యమైన రాజకీయాలకు బాటలు వేస్తుంది. ఆ మాటను ఈ రోజు ప్రజలు తమ ఓటుతో అక్షరాలా రుజువు చేశారు” అని ఆయన పేర్కొన్నారు. తుపాన్లు, ప్రకృతి విపత్తులు చుట్టుముట్టిన క్లిష్ట సమయాల్లోనూ ప్రజల సంక్షేమాన్ని విస్మరించకుండా ప్రభుత్వం చూపిన చొరవను ప్రజలు హృదయపూర్వకంగా ఆదరించారని గుర్తుచేశారు.

2024 సార్వత్రిక ఎన్నికల నాటి గాలి కంటే, ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో కూటమిపై నమ్మకం మరింత బలపడిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ముఖ్యమంత్రి విశ్లేషించారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా అన్ని వర్గాల ఓటర్లు కూటమి వెంటే నిలిచారని చెప్పారు. “ఓటింగ్ పద్ధతి ఏదైనా.. ఈవీఎంలు వాడినా, బ్యాలెట్ పేపర్లు తెచ్చినా, పోస్టల్ ఓట్లయినా.. జనం ఎంచుకున్న మార్గం ఒక్కటే, అది కూటమి ప్రగతి బాట” అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ, పల్నాడు, పశ్చిమగోదావరి వంటి కీలక జిల్లాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కనీస ప్రజా మద్దతు కూడా దక్కలేదని, ప్రతిపక్షాన్ని ప్రజలు పూర్తిగా పక్కన పెట్టేశారని దుయ్యబట్టారు.

ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా, ప్రశాంత వాతావరణంలో ఓటర్లు స్వేచ్ఛగా తమ తీర్పును వెలువరించడం ప్రజాస్వామ్య విజయమని చంద్రబాబు కొనియాడారు. ఈ అపూర్వ విజయం తమలో అహంకారాన్ని కాకుండా బాధ్యతను రెట్టింపు చేసిందని, భవిష్యత్తులో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో మరింత పరుగులు పెట్టించేందుకు రెట్టింపు ఉత్సాహంతో, అంకితభావంతో పనిచేస్తామని హామీ ఇచ్చారు.















