Skip to main content

Namaste NRI

విజయసాయి‘పరివర్తన’ పార్టీ వెనుక అసలు కథేంటి?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దశాబ్ద కాలం పాటు తెరవెనుక చక్రం తిప్పిన వ్యూహకర్త, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు నేరుగా రాజకీయ రణరంగంలోకి దిగారు. ‘పరివర్తన రాజకీయ పార్టీ’ (పీఆర్పీ) పేరుతో ఆయన ఏర్పాటు చేసిన కొత్త పార్టీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. విజయవాడ వేదికగా జెండా, అజెండా, పార్టీ యాప్‌ను ఆవిష్కరించిన ఆయన, తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇది కేవలం ఒక కొత్త పార్టీ ఆరంభం మాత్రమే కాదు, గతంలో తాను నడిపిన పార్టీకే గట్టి సవాల్ విసిరే ప్రయత్నంగా కనిపిస్తోంది.

విజయసాయిరెడ్డి తన పార్టీకి ‘పీఆర్పీ’ అనే సంక్షిప్త నామాన్ని ఎంచుకోవడం ఆసక్తికరం. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి కూడా ఇదే షార్ట్ ఫామ్ ఉండేది. ఇక జెండా విషయానికి వస్తే.. పైన కాషాయం, కింద తెలుపు, మధ్యలో చక్రంతో రూపొందించారు. జాతీయవాద భావజాలానికి దగ్గరగా కనిపిస్తూనే, తమిళనాడు తరహాలో ఏపీలో మూడో ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకప్పుడు వైసీపీలో నంబర్ టూగా వెలుగొందిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు అదే పార్టీ అధినేత జగన్‌పై చేసిన విమర్శలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. 2019లో 151 సీట్లు గెలిచిన వైసీపీ, 2024లో 11 స్థానాలకు పడిపోవడానికి జగన్ అహంకారం, అహంభావమే కారణమని ఆయన విమర్శించారు. పార్టీ నిర్మాణంలో తన శ్రమ ఉన్నా, తనకు దక్కాల్సిన గుర్తింపు, గౌరవం దక్కలేదంటూ తన అసంతృప్తిని బయటపెట్టారు.

తాను ముఖ్యమంత్రి రేసులో లేనని, కేవలం మార్గదర్శకుడిగా ఉంటూ యువతను సీఎం చేయడమే తన లక్ష్యమని విజయసాయిరెడ్డి ప్రకటించారు. 2029 ఎన్నికల్లో మొత్తం 175 స్థానాల్లో పోటీ చేస్తామని చెబుతూనే, అందులో 66 శాతం సీట్లు యువతకు, 33 శాతం మహిళలకు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న నేతలకు తమ పార్టీ తలుపులు తెరిచే ఉన్నాయని సంకేతాలివ్వడం ద్వారా ఆ పార్టీ క్యాడర్‌ను చీల్చే వ్యూహం కనిపిస్తోంది.

అయితే.. పార్టీ ప్రకటించిన మొదటి రోజే విజయసాయిరెడ్డికి ఒక సవాల్ ఎదురైంది.‘పరివర్తన రాజకీయ పార్టీ’ పేరుతో ఇప్పటికే ఢిల్లీలో ముఖేష్ అనే వ్యక్తి ఒక పార్టీ రిజిస్టర్ చేసి ఉన్నారు. ఇటీవల తమిళనాడు, పుదుచ్చేరి ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ కూడా చేసింది. దీంతో విజయసాయి పార్టీకి ఎన్నికల సంఘం వద్ద సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరి ఈ చిక్కుముడి నుంచి విజయసాయి రెడ్డి ఎలా బయటపడతారే వేచి చూడాలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events