సీనియర్ నటుడు బాబు మోహన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్‌లో వైరల్ అవుతున్నాయి. నాని హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా యూనిట్‌పై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను అవమానించినందుకే వారికి కర్మ తగిలి సినిమా బాక్సాఫీస్ వద్ద ఆడలేదని బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాబు మోహన్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర కోసం మేకర్స్ తనను సంప్రదించారని చెప్పారు. తనకు మేకప్ వేసి, రకరకాల కాస్ట్యూమ్స్‌తో లుక్ టెస్ట్ కూడా చేశారని తెలిపారు. ఆ పాత్రకు మీరే కరెక్ట్ అని మెచ్చుకుని, షూటింగ్ మొదలయ్యాక పిలుస్తామని చెప్పారన్నారు. కానీ, సినిమా రిలీజ్ అయ్యే వరకు వారి నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదని బాబు మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఆ పాత్రకు తనను తీసుకోవడం లేదన్న విషయం కూడా చెప్పకపోవడం తనను అవమానించడమేనని ఆయన మండిపడ్డారు.

భారీ అంచనాలతో వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా నిజాం ఏరియా తప్ప మిగతా చోట్ల పెద్దగా ఆడలేదని, కథనం స్లోగా ఉందనే టాక్ వచ్చిందని బాబు మోహన్ గుర్తు చేశారు. ఇండస్ట్రీలో తనను అందరూ ‘లక్కీ లెగ్’ అంటారని, గతంలో తనను పక్కన పెట్టిన కొన్ని సినిమాలు ఇలాగే ఫ్లాప్ అయ్యాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకు కూడా అదే జరిగిందని, చేసిన తప్పుకు వారికి కర్మ ఫలం దక్కిందని బాబు మోహన్ ఘాటుగా విమర్శించారు.















