అబుదాబీ లో జరిగిన రష్యా-ఉక్రెయిన్ శాంతి చర్చల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భారీ సంఖ్యలో యుద్ధ ఖైదీలను అప్పగించేందుకు రెండు దేశాల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. ఖైదీల విడుదలకు అంగీకరించినప్పటికీ దీనికి సంబంధించిన కచ్చితమైన సంఖ్యను మరికొన్ని గంటల్లో ఖరారు చేస్తామని అమెరికా ప్రతినిధి బృందం పేర్కొన్నది. యుద్ధ ఖైదీల అప్పగింతపై చర్చలు సానకూలంగా జరిగాయని తెలిపింది.

ఒక్కోవైపు నుంచి సుమారు 1,000 నుంచి 1,500 మంది యుద్ధ ఖైదీలను విడుదలచేసే అంశంపై సమాలోచనలు చేసినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. యుద్ధాన్ని విరమింపజేసే లక్ష్యంతో అమెరికా మధ్యవర్తిత్వంలో అబుదాబీ వేదికగా రెండు రోజులపాటు త్రైపాక్షిక చర్చలు జరిగాయి. అమెరికా తరఫున అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, దౌత్యవేత్త స్టీవ్ విట్‌కాఫ్‌లు ఇందులో పాల్గొన్నారు.రష్యా బృందానికి వ్లాదిమిర్ మెడిన్‌స్కీ, ఉక్రెయిన్ తరఫున రుస్తెం ఉమెరోవ్ నేతృత్వం వహించారు. గతంలో విఫలమైన శాంతి ప్రయత్నాలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని అమెరికా ప్రతినిధి బృందం పేర్కొన్నది.















