ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అత్యంత నమ్మకమైన ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలో నిర్వహిస్తున్న సిఐఐ భాగస్వామ్య సదస్సు 2026లో ఆయన పారిశ్రామికవేత్త లను ఉద్దేశించి మాట్లాడారు. ఏపీని కేవలం పెట్టుబడులు పెట్టే రాష్ట్రంగా కాకుండా, సొంత ప్రాంతంగా భావించి పరిశ్రమలను స్థాపించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. పరిశ్రమల స్థాపన, ఆధునిక యంత్రాల కొనుగోలు, మౌలిక సదుపాయాల కల్పనతోనే పెట్టుబడుల బాధ్యత ముగిసిపోకూడదని అభిప్రాయపడ్డారు. యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రజల సామర్థ్యం, కొత్త ఆలోచనలు, సృజనాత్మకతపైనా పెట్టుబడులు పెట్టాలని సూచించారు. ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ స్థానిక ప్రతిభను ప్రోత్సహించినప్పుడే పెట్టుబడులకు నిజమైన అర్థం ఉంటుందని ఆయన వ్యాఖ్యల సారాంశం. అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేయకూడదని పవన్ కళ్యాణ్ పారిశ్రామికవేత్తలకు సూచించారు.

పారిశ్రామిక ప్రగతి, పర్యావరణ పరిరక్షణ రెండూ సమాంతరంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపన ద్వారా సంపద సృష్టించడంతో పాటు సహజ వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అందరిపై ఉందని పేర్కొన్నారు. పర్యావరణానికి హాని కలగకుండా సాంకేతికతను వినియోగించుకుంటూ స్థిరమైన అభివృద్ధి సాధించాల్సిన అవసరాన్ని వివరించారు. పెట్టుబడులు కేవలం ఆర్థిక లాభాలకే పరిమితం కాకుండా ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు, స్థానిక అభివృద్ధికి దోహదపడాలని ఆకాంక్షించారు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యత సాధించినప్పుడే భవిష్యత్ తరాలకు మెరుగైన రాష్ట్రాన్ని అందించగలమనే సందేశాన్ని సిఐఐ సదస్సు వేదికగా పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు.















