టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయన నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఎంతో ఘనంగా జరిగింది. ఎలాంటి హడావుడి లేకుండా జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు ఈ వేడుకలో సందడి చేశారు. ఇక సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, రానా, శివాజీ, వరలక్ష్మి శరత్‌కుమార్ దంపతులతో పాటు దర్శకులు రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, కార్తీక్ ఘట్టమనేని, నిర్మాతలు విశ్వప్రసాద్, సాహు గారపాటి తదితరులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.


ఇక తేజ సజ్జా వివాహం వచ్చే నెల, అంటే డిసెంబరులో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా జరగనుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ అనంతరం హైదరాబాద్‌లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం రిసెప్షన్ వేడుకను ఏర్పాటు చేయనున్నారు. కాగా, ఇది పూర్తిగా తమ పెద్దలు కుదిర్చిన వివాహమని తేజ సజ్జా ఇటీవలే స్పష్టం చేశారు. వధువు కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని, వారు టెక్నాలజీ వ్యాపార రంగంలో స్థిరపడ్డారని ఆయన వెల్లడించారు. వెండితెరపై ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటిన ఈ యువ హీరో, ఇప్పుడు నిజ జీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.















