Skip to main content

Namaste NRI

సమ్మక్క సాగర్ బ్యారేజీకి లైన్ క్లియర్!?

ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద నిర్మాణం పూర్తయిన సమ్మక్క సాగర్ బ్యారేజీకి నిరభ్యంతర పత్రం (NOC) జారీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయిని కోరారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మంగళవారం ఛత్తీస్‌గఢ్ సీఎంతో భేటీ అయిన రేవంత్ రెడ్డి, ఎల్ నినో ప్రభావం వల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రంలో నీటి అవసరాలు పెరిగే అవకాశం ఉందని వివరించారు. బ్యారేజీలో 6.94 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునేందుకు వెంటనే అనుమతి ఇస్తే ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సాగు, తాగునీరు అందుతుందని తెలపగా, ఎన్‌ఓసీ ప్రక్రియను త్వరగా పూర్తి చేస్తామని విష్ణుదేవ్ సాయి హామీ ఇచ్చారు.

గతంలో ఈ ప్రాజెక్టును కాంతనపల్లి వద్ద నిర్మించాలనుకున్నప్పుడు ఛత్తీస్‌గఢ్‌లో 11 వేల ఎకరాలకు పైగా భూమి, 17 గ్రామాలు మునిగిపోతాయనే ఆందోళన ఉండేది. అయితే, ప్రాజెక్టును తుపాకులగూడెంకు మార్చాక పరిస్థితి పూర్తిగా మారింది. తెలంగాణ ప్రభుత్వం చెల్లించిన రూ. 9.88 కోట్లతో ఐఐటీ ఖరగ్‌పూర్ జరిపిన అధ్యయనంలో, బ్యారేజీ పూర్తి స్థాయిలో నిండినా ఛత్తీస్‌గఢ్‌లో కేవలం 33 ఎకరాలు మాత్రమే ముంపునకు గురవుతాయని తేలింది.

ఈ ముంపు ప్రాంతానికి సంబంధించి భూసేకరణ, పరిహారం, పునరావాస ఖర్చులన్నింటినీ భరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్ర జల సంఘం తుది అనుమతులు రావడానికి ఛత్తీస్‌గఢ్ ఎన్‌ఓసీ అత్యంత కీలకం కావడంతో, ఈ భేటీ ద్వారా ప్రాజెక్టు ప్రారంభానికి మార్గం సుగమమైంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events