రష్మిక మందన్నా ప్రధాన పాత్రలో రూపొందిన పాన్ ఇండియా చిత్రం మైసా. రవీంద్ర పుల్లె దర్శకుడు. ఈ నెల 27న విడుదల కానున్నది. ఈ సినిమాలోని మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు. బ్లాక్‌బస్టర్ ఒసేయ్ రాములమ్మ లోని ఓ ముత్యాలరెమ్మ పాటకు ఇది రీ క్రియేషన్ కావడం విశేషం. ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్లో రష్మిక మాట్లాడారు. ఓసేయ్ రాములమ్మ పాటను రీక్రియేట్ అనగానే కొంచెం భయమేసింది. ఎందుకంటే అలాంటి ఐకానిక్ సాంగ్‌ని రీక్రియేట్ చేయడం పెద్ద బాధ్యత. ఆ పాటకు న్యాయం చేసేలా ప్రయత్నం చేశాం. వందేమాతరం శ్రీనివాస్ ఆ పాట పాడటం ఆనందంగా ఉంది. సుద్దాల అశోక్‌తేజ అద్భుతమైన సాహిత్యం అందించారు. ఈ రీక్రియేషన్కు కూడా మీరు ఆనాటి ప్రేమనే అందిస్తారని ఆశిస్తున్నా అన అన్నారు.

ఓ ముత్యాలరెమ్మ.. ఓ మురిపాల కొమ్మ.. ఓ పున్నమి రెమ్మ.. ఓ పుత్తడి బొమ్మ.. ఓ రాములమ్మా.. రాములమ్మా.. నీ చూపులోయమ్మ.. చురకత్తులేనమ్మ.. నీ చేతులోయమ్మ.. శివుని శూలాలేనమ్మ.. ఓ రాములమ్మ..’ అంటూ ఈ సినిమాలోని రష్మిక పాత్ర స్వభావాన్ని ఆవిష్కరించేలా సుద్దాల అశోక్‌తేజ పాట రాయగా, వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. జేమ్స్ బిజోయ్ ఈ పాటకు కొత్త మ్యూజికల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఈ పాటను రీక్రియేట్ చేయడం పట్ల వందేమాతరం శ్రీనివాస్ సంతోషం వెలిబుచ్చారు. తెలంగాణ కోడలు రష్మికకు పాట రాసే అవకాశం రావడం గొప్ప అదృష్టమని సుద్దాల అశోక్ తేజ ఆనందం వ్యక్తం చేశారు.















