Skip to main content

Namaste NRI

రిలీజైన గంటల వ్యవధిలోనే 4 సినిమాల పైరసీ!

తెలుగు చిత్ర పరిశ్రమను పైరసీ భూతం మరోసారి గట్టిగా దెబ్బతీసింది. తాజాగా విడుదలైన నాలుగు సినిమాలను దుండగులు ఆన్‌లైన్‌లో లీక్ చేయడం సినీ వర్గాల్లో కలకలం రేపుతోంది. రణబాలి, కల్ట్, ఆదర్శ కుటుంబం సినిమాలను కర్నూలులోని సిటీ స్క్వేర్ మాల్ సినిమా థియేటర్‌లో దుండగులు అత్యంత రహస్యంగా చిత్రీకరించి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశారు. అంతేకాకుండా, నవంబర్ 20న విడుదలైన ‘ఆకాశంలో ఒక తార’ చిత్రం కూడా థియేటర్లలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే ఒక వెబ్‌సైట్‌లో ప్రత్యక్షమైంది.

ఈ నాలుగు సినిమాల పైరసీ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు చెందిన యాంటీ వీడియో పైరసీ సెల్ ప్రాజెక్ట్ హెడ్ యర్రా మణీంద్రబాబు శుక్రవారం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌లో ఈ సినిమాల పైరసీ కాపీలు ఉన్నట్లు గుర్తించి ఆధారాలతో సహా పోలీసులకు అందించారు. ఈ ఫిర్యాదు మేరకు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి, కర్నూలు థియేటర్ కేంద్రంగా జరిగిన ఈ పైరసీ కుట్ర వెనుక ఉన్న నిందితులను పట్టుకునేందుకు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.

కోట్ల రూపాయల బడ్జెట్, వందలాది మంది సాంకేతిక నిపుణులు, కళాకారుల నెలల తరబడి శ్రమతో రూపొందే సినిమాలను పైరసీ ముఠాలు నిమిషాల్లో నాశనం చేస్తున్నాయి. సినిమా విడుదలైన మొదటి రోజే హెచ్‌డీ ప్రింట్లు ఆన్‌లైన్‌లో దర్శనమివ్వడంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనుకాడుతున్నారు. దీనివల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కోలుకోలేని ఆర్థిక నష్టాలను చవిచూస్తూ, మొత్తం సినీ పరిశ్రమ మనుగడే ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఏర్పడింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events