భారత్, పాకిస్థాన్‌లు తమ దేశాల్లోని అణు స్థావరాలు, ఖైదీల జాబితాలను పరస్పరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న కారణంగా మూడు దశాబ్దాల కిందట ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని కొనసాగించాయి. న్యూఢల్లీి, ఇస్లామాబాద్‌లలో దౌత్య మార్గంలో ఏకకాలంలో ఈ జాబితాను ఇచ్చిపుచ్చుకున్నట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. అణు కేంద్రాలపై పరస్పర దాడులను నిషేధించేందుకు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం సమాచార మార్పిడి జరిగినట్టు తెలిపింది. అణు కేంద్రాలపై పరస్పర దాడులను నిషేధించేందుకు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందంపై 1988 డిసెంబర్ 31న భారత్, పాకిస్థాన్ సంతకం చేశాయి. 1991 జనవరి 27 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అప్పట్నించి 31 ఏళ్లుగా ఏటా జనవరి 1న ఇరు దేశాలు ఈ జాబితాను ఇచ్చిపుచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ జాబితాల ప్రకారం 282 మంది పాకిస్థాన్ ఖైదీలు, 73 మంది మత్స్యకారులు భారత్ కష్టడీలో ఉన్నారు. మరో వైపు 51 మంది భారత ఖైదీలు, 577 మంది మత్స్యకారులు పాకిస్థాన్ కస్టడీలో ఉన్నారు. కాగా, భారత ఖైదీలతో పాటు అదృశ్యమైన రక్షణ సిబ్బంది, మత్స్యకారులను త్వరగా విడుదల చేయాలని పాకిస్థాన్ దౌత్య అధికారులను భారత దౌత్య అధికారులు ఈ సందర్భంగా కోరారు. పాక్ దౌత్య అధికారులు కూడా వారి దేశ ఖైదీలు, మత్స్యకారుల విడుదలపై చర్చించారు. ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నప్పటికీ ఈ ఆనవాయితీని కొనసాగించారు.














