అమెరికాలో గ్వామ్ దీవిని కూడా తాకగల మధ్యశ్రేణి క్షిపణిని తాము విజయవంతంగా ప్రయోగించినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ అధికార న్యూస్ ఏజెన్సీ ఒక ప్రకటన చేసింది. ఈ క్షిపణికి అణ్వస్త్రాన్ని మోసుకుపోగల శక్తి ఉంది. ఈ ఏడాది జనవరిలో ఉత్తర కొరియా జరిపిన ఏడవ క్షిపణి పరీక్ష ఇది. తమపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలను తొలగించడమే లేదా అణ్వస్త్ర సహిత దేశంగా గుర్తించడమో చేసేట్లు ఒత్తిడి పెంచడమే ఉత్తర కొరియా వరుస క్షిపని పరీక్షల లక్ష్యం. తాజా పరీక్ష వల్ల కొత్తగా ఆంక్షలు విధిస్తే ఉత్తర కొరియా ఈసారి ఏకంగా అమెరికా ప్రధాన భూభాగాన్ని తాకగల దూరశ్రేణి క్షిపణినీ పరీక్షించవచ్చని విశ్లేషకుల అంచనా. అమెరికా గ్వామ్ దీవి 11,500 కిలోమీటర్ల దూరంలో ఉండగా, ఉత్తర కొరియా నుంచి 3,430 కిలోమీటర్ల దూరంలో ఉంది. దక్షిణ కొరియా అంచనా ప్రకారం ఈ మిసైల్ 800 కిలోమీటర్లు పయనించిందని, 2 వేల కిలోమీటర్ల ఎత్తును చేరుకుందని తెలుస్తోంది.














