తన అధికార నివాసం 10 డౌనింగ్ స్ట్రీట్లో కొవిడ్ లాక్డౌన్ ఆంక్షలను ఉల్లంఘించి సిబ్బందితో కలిసి విందులు జరుపుకున్న వ్యవహారంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ క్షమాపణ కోరారు. బ్రిటన్లో లాక్డౌన్ కొనసాగుతున్న తరుణంలో ప్రధాని కార్యాలయంలో విందు పార్టీలు జరగడం నిజమేనని ఈ విషయమై ఏర్పాటైన కమిటీ తేల్చి చెప్పింది. దీంతో ఈ విషయంపై క్షమాపణ కోరుతున్నట్లు బోరిస్ తెలిపారు. అయితే విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు రాజీనామా చేయాల్సిన అవసరం లేదని, ఇకపై తన కార్యాలయాన్ని మరింత సంస్కరిస్తానని తెలిపారు. తనపై, తన ప్రభుత్వంపై నమ్మకం ఉంచాలని కోరారు. ప్రభుత్వ ప్రమాణాలను ఉల్లంఘించేలా డౌన్స్ట్రీట్ కార్యాలయంలో పార్టీలు జరిగాయని సూ గ్రే నేతృత్వంలోని విచారణ కమిటీ వెల్లడిరచింది. ఈ కమిటీ నివేదిక బహిర్గతమైంది. అయితే నివేదిక పూర్తి పాఠం బయటకపెట్టకపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
2020, 2021లలో ప్రధాని అధికారిక నివాసంలో జరిగిన పుట్టిన రోజు వేడుకలు, ఇతర విందులపై ఆమె దర్యాపు జరిపారు. మొత్తం 16 సందర్భాల్లో ప్రధాని కార్యాలయ సిబ్బంది లాక్డౌన్ ఆంక్షలను ధిక్కరిస్తూ విందులు జరుపుకున్నట్లు తెలుస్తోంది. వీటిలో నాలుగింటిపై దర్యాప్తు నివేదిక వెలువడిరది. మిగిలిన 12 విందులపై లండన్ మెట్రో పాలిటన్ పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.














