విశ్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఓరి దేవుడా. మిథిలా పాల్కర్, ఆశాభాట్ కథానాయికలు. అశ్వథ్ మారిమత్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆశాభట్ మాట్లాడుతూ ఈ సినిమాలో నేను మీరా అనే అసిస్టెంట్ దర్శకురాలి పాత్రలో కనిపిస్తా. నాకు నృత్యంలో మంచి ప్రావీణ్యం ఉంది. అందుకు అనుగుణంగానే దర్శకుడు నా పాత్రను డిజైన్ చేశారు. నేను కన్నడ అమ్మాయిని కాబట్టి తెలుగు అర్థం చేసుకోవడం పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు అని చెప్పింది. మిథిలా పాల్కర్ మాట్లాడుతూ స్నేహం, ప్రేమ, పెళ్లి అంశాల చుట్టూ తిరిగే కథ ఇది. ఈ సినిమాలో నా పాత్ర పేరు అను. నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. తెలుగు నేటివిటీకి అనుగుణంగా దర్శకుడు ఈ కథను తీర్చిదిద్దారు. నేను గతంలో వెబ్ సినిమాల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నా. ఈ సినిమా తెలుగులో నాకు శుభారంభాన్నిస్తుందన్న నమ్మకం ఉంది అని చెప్పింది. ఈ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.














