సినీ నటుడు తారకరత్నమరణంతో నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. బెంగుళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రిలో 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు.. జనవరి 26న టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో తారకరత్న పాల్గొన్నారు. కుప్పంలో పూజా కార్యక్రమాల అనంతరం లోకేశ్‌తో కలిసి పాదయాత్ర ప్రారంభించిన ఆయనకు హఠాత్తుగా గుండె పోటు రావడంతో కుప్పకూలారు. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. తారకరత్నకు 23 రోజులుగా అక్కడే చికిత్సను అందిస్తున్నారు. ఆయనను కాపాడటానికి విదేశీ వైద్యబృందం శతవిధాల ప్రయత్నించారు. అయినప్పటికీ, ఆ ప్రయత్నం మాత్రం ఫలించలేదు.
తారకరత్నకు భార్య అలేఖ్యరెడ్డి , ఓ కూతురు ఉన్నారు. ఛాయాగ్రాహకుడు మోహనకృష్ణ తనయుడైన తారకరత్నకు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే ఇష్టం. బాలకృష్ణ ప్రోత్సాహంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఒకటో నెం. కుర్రాడు చిత్రంతో హీరోగా వెండితెరపైకి రంగప్రవేశం చేశారు. తారకరత్న హీరోగా దాదాపుగా 20 చిత్రాల్లో నటించారు. పలు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రల్లో కనిపించి అలరించారు. అమరావతి సినిమా ఆయనకు ఉత్తమ విలన్‌గా నంది అవార్డును తీసుకొచ్చింది. ఈ చిత్రం 2009లో విడుదలైంది. తారకరత్న 2022లో ఓటీటీకి ఎంట్రీ ఇచ్చారు. 9 అవర్స్ వెబ్‌సిరీస్‌లో నటించారు. చివరిగా సారధి మూవీలో కనిపించారు.
తారకరత్న భౌతిక కాయం బెంగుళూరు నుంచి నేడు రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలో ఆయన నివాసానికి చేరుకుంది. అక్కడి నుంచి సోమవారం ఉదయం ఆయన భౌతిక కాయాన్ని ఫిలిం చాంబర్‌కు తరలిస్తారు. అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంచుతారు. ఐదు గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
సినీ, రాజకీయ ప్రముఖుల సంతాపం…
తెలుగు సినీ నటుడు, నందమూరి తారకరత్న మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. నందమూరి తారక రత్న అకాల మరణం బాధాకరం. చలనచిత్ర, వినోద ప్రపంచంలో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నారు. ఈ విషాద సమయంలో నా ఆలోచనలు ఆయన కుటుంబం, అభిమానులతోనే ఉన్నాయి. ఓం శాంతి అని ట్వీట్ చేశారు. నందమూరి తారకరత్న మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
తారకరత్న భౌతికకాయానికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. సతీమణి భువనేశ్వరి, తనయుడు లోకేశ్‌తో కలిసి మోకిలలోని తారకరత్న నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. అనంతరం తారకరత్న కుటుంబ సభ్యులను పరామర్శించారు. తారకరత్న భౌతికకాయానికి ఆయన సోదరులు కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్ నివాళులర్పించారు. తారక్ పార్థివ దేహాన్ని చూసిన భావోద్వేగానికి గురయ్యారు. తారకరత్న మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. చిరంజీవి, పవన్‌కల్యాణ్, రవితేజ, నాగశౌర్య, అల్లరి నరేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి తదితరులు తమ సంతాపం ప్రకటించారు.














